విజయ్‌ మాల్యా, రామోజీ ఒక్కటే… ఉండవల్లి నిప్పులు!

మార్గదర్శి వ్యవహారంపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఒంటరిగా పోరాడుతున్న ఉండవల్లికి ఉన్నఫలంగా… ఎక్కడలేని ధైర్యం, తాను చేస్తున్న పోరాటం సక్సెస్ అవుతుందనే నమ్మకం. తనవంతుగా దేశానికి ఏదో ఒక సేవ చేశాననే సంతృప్తి ఒకేసారి వచ్చేసినట్లున్నాయి. దీంతో… రామోజీ రావుపై ప్రశ్నల వర్షాలు కురిపించారు.. తనదైన గోదావరి వెటకారాన్ని మేళవిస్తూ సెటైర్స్ వేశారు.

ఈనాడు, మార్గదర్శి గ్రూప్స్‌ చైర్మన్‌ రామోజీరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. రామోజీపై తన పోరాటానికి అఫిడవిట్ ద్వారా జగన్ మద్దతునిచ్చారని.. ఆయన కమిట్ మెంట్ కు సలాం చేస్తున్నానని ఉండవల్లి తెలిపారు. తన పోరాటానికి ధర్మంగా జగన్ గట్టిగా నిలబడ్డారనేది ఉండవల్లి మాట. ఈ సందర్భంగా… రామోజీకి – సీఐడీ విచారణకు – చట్టాలకు సంబందించిన అంశాలపై సవివరంగా స్పందించారు ఉండవల్లి.

మార్గదర్శి చిట్ ఫండ్స్.. నిబంధనలు ఉల్లంఘించిందని, ఈ విషయం తాను ఏనాడో చెప్పానని మొదలుపెట్టిన ఉండవల్లి… ఆ సంస్థ నష్టాల్లో నడుస్తోందని కూడా తాను ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. ఆ తప్పులు బయటకు తీసినందుకు నాపై రామోజీరావు కేసులు పెట్టించారని.. డిపాజిటర్ల సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

బ్రహ్మయ్య అండ్‌ కంపెనీకి చెందిన సీఏను అరెస్ట్‌ చేస్తే.. అది చార్టెడ్ అకౌంటెంట్స్ అందరిపై దాడి ఎలా అవుతుందని ప్రశ్నించిన ఉండవల్లి… తప్పు ఎవరు చేసినా తప్పే అని తేల్చి చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. రామోజీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అంతా సమానమే అని పేర్కొన్నారు.

ఇక సీఐడీ విచారణ సందర్భంగా వైరల్ అయినా “బెడ్ పై రామోజీ” ఫోటోపై కూడా ఉండవల్లి తనదైన శైలిలో స్పందించారు. తనకు తెలిసి రామోజీరావు అస్వస్థతకు గురైనట్లు తాను ఎన్నడూ ఒక వార్త కానీ, సమాచారం కాని వినలేదని తెలిపిన అరుణ్‌ కుమార్‌… సీఐడీ విచారణ అనేసరికి ఆయన అస్వస్థత డ్రామా ఆడారని అనిపస్తోందని అన్నారు.

ఈ ఫ్లోని కంటిన్యూ చేస్తూ ఫైరయిన ఉండవల్లి… విజయ మాల్యాకూ రామోజీ రావుకూ పెద్ద తేడా ఏమీ లేదని బాంబు పేల్చారు. ఇదే సమయంలో సత్యం రామలింగరాజుకు శిక్ష పడినట్లే, సెక్షన్‌ 477–ఏ ప్రకారం అకౌంట్స్‌ తారుమారు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జగన్ ని అభినందించిన అరుణ్ కుమార్… ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మొండోడు కావడంతో రామోజీ అవినీతిని బయటపెడుతున్నారని తెలిపారు. గతంలో ఆయా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రామోజీరావు ఇంటికి వెళ్లడానికి కూడా పోలీసులు భయపడేవారని.. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకడం లేదని స్పష్టం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్!!