తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం అనే అంశం కాక ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బిక్కవోలు పోలీసు స్టేషన్లో చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ విషయాలపై తాజాగా స్పందించారు ఉండవల్లి అరుణ్ కుమార్!
అనపర్తిలో చంద్రబాబు పర్యటనలో జరిగిన విషయాలు చంద్ర్బాబుకి ప్లస్సా కాదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… జగన్ కు మాత్రం మైనస్ అని అంటున్నారు ఉండవల్లి. వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి లోకేష్ వరకూ అందరి పాదయాత్రలూ చూశానని చెబుతున్న ఉండవల్లి… చంద్రబాబుని మాత్రం అనపర్తిలో అడ్డుకుని ఉండకపోతే బాగుండేది అని అంటున్నారు!
పాదయాత్రల్లో ప్రత్రిపక్ష నాయకులు పడే కష్టం కంటే… అప్పటి అధికారపార్టీలు పెట్టే ఇబ్బందులే మరింత ప్లస్ అవుతాయనేది ఉండవల్లి ఆలోచన. అందుకు ఆయన చెప్పిన ఉదాహరణ… నాడు కాంగ్రెస్ జగన్ ను జైలుకు పంపడం వల్లే ముఖ్యమంత్రి అయ్యారని.
ఈ వ్యవహారాన్ని పొలిటికల్ సూసైడ్ గా అభివర్ణిస్తున్నారు ఉండవల్లి. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. కేవలం ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి నాడు జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనే ఉదాహరణ అని క్లారిటీ ఇచ్చారు. అలాంటి పనులు నేడు చంద్రబాబు విషయంలో జగన్ చేయడం కూడా… రాజకీయ ఆత్మహత్య కోవలోకే వస్తుందనేది ఉండవల్లి క్లారిటీ అన్నమాట!
ఏది ఏమైనా… జీవో నెం. 1 ని పటిష్టంగా అమలు చేస్తున్నామనే సంకేతాలు జగన్ సర్కార్ ప్రజలకు ఇవ్వాలి తప్ప… ఏదో కావాలని పోలీసులు అడ్డుకుంటున్నారనే సంకేతల్లా జనల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు! కానిపక్షంలో… ఇలాంటివి వైకాపా ఆత్మహత్య కార్యక్రమాలుగా మారతాయి అనడంలో సందేహం లేదు!