వైసిపిలో చేరనున్న టిడిపి ఎంఎల్ఏలు..చంద్రబాబుకు షాక్

వైసిపిలో చేరటానికి ఇద్దరు తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పటికే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు కూడా జరిపారు. అయితే, తమ డిమాండ్ల  ఆమోదం విషయంలో జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.  ఇంతకీ ఆ ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరంటే గుంటూరు జిల్లాలోని మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. వీరిద్దరికి చంద్రబాబునాయుడుతో చాలా కాలం క్రితమే సంబంధాలు చెడిపోయాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో చంద్రబాబు టిక్కెట్లిచ్చే విషయంలో ఇద్దరిలోను అనుమానాలు మొదలయ్యాయి. అనుమానాలతో చివరి నిముషంలో ఉండేకన్నా ఇప్పుడే పార్టీ మారితే బాగుంటుందని అనుకున్నారు.

 

నిజానికి వీరిద్దరూ వైసిపిలో చేరుతారన్న ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. మోదుగుల ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ కాగా రావెల ప్రత్తిపాడు ఎంఎల్ఏగా ఉన్నారు. రావెల మొదటిసారి గెలిస్తే మోదుగుల మాత్రం గతంలో ఎంపిగా పనిచేశారు. తన నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావటం లేదని మోదుగుల బహిరంగంగానే చాలాసార్లు ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని మోదుగుల మండిపోతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసినా ఉపయోగం ఉండదని భావించారు. అందుకనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

 

ఇక, రావెలది ప్రత్యేకమైన కేసు. కేంద్రప్రభుత్వ అధికారిగా ఉన్న రావెల పోయిన ఎన్నికల్లో టిడిపిలో చేరి టిక్కెట్టు సాధించి గెలిచారు. అదృష్టంతో మంత్రి కూడా అయిపోయారు. అయితే, అక్కడి నుండే సమస్యలు మొదలయ్యాయి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రావెలకు  జిల్లాలోని మిగిలిన ఎంఎల్ఏలు, మంత్రితో సఖ్యత కుదరలేదు. రావెల దూకుడు కూడా టిడిపి నేతలకు నచ్చలేదు. దాంతో రావెల ఒకవైపు మిగిలిన నేతలంతా మరోవైపుగా మిగిలిపోయారు. చివరకు రావెలను మంత్రివర్గంలో నుండి తప్పించే వరకూ ప్రత్యర్ధి వర్గం నిద్రపోలేదు. మంత్రి పదవి పోగానే రావెల మిగిలిన నేతలకు దూరంగా ఉంటున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుండి ఎంపిగా పోటీ చేయాలన్నది మోదుగుల ఆలోచన. అయితే, జగన్ అందుకు అంగీకరించలేదని సమాచారం. మళ్ళీ గుంటూరు వెస్ట్ నుండే పోటీ చేయమని సూచించారట. మరి మోదుగుల ఏం నిర్ణయం తీసుకున్నారో తెలీదు. అదేవిధంగా రావెల ప్రత్తిపాడులో తనకు టిక్కెట్టు కావాలని అడిగారు. దానికి జగన్ సానుకూలంగా స్పందతిచలేదని తెలిసింది. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో సమన్వయకర్తగా మేకతోటి సుచరిత పనిచేస్తున్నారు. ఆమె పనితీరుపై జగన్ పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు.

 

పైగా పార్టీ కార్యక్రమాలను ముందుండి మరీ నడిపించారు. ఇటువంటి నేతను రావెల కోసం పక్కన పెట్టటం జగన్ ఇష్టపడటం లేదు. అందుకే షరతులు లేకుండా ముందు పార్టీలో చేరితే తర్వాత సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పారట. మరి రావెల ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి టిడిపి ఎంఎల్ఏలు ఇద్దరూ వైసిపిలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తోంది.