ఏపీ రాజకీయాలు మొత్తం గతకొన్ని నెలలుగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజలు కూడా వార్తల్లో రాజధాని అంశం కోసం ఎదురుచూస్తున్నారు. మూడు రాజధానుల నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుంటే అమరావతి రైతులు, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కోర్ట్ కూడా మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో విధించడం వల్ల రైతులు కొంత వరకు ఆనందపడుతున్నారు. అయితే మూడు రాజధానుల అంశంపై వైసీపీ నేతలు కూడా విముఖత చూపుతున్నారు. వాళ్లలో ముఖ్యంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
వారిద్దరికీ అమరావతి ప్రాంతంలో చాలా కష్టంగానే ఉంది పరిస్థితి. అమరావతి రైతులు అంటూ కొంత మంది సన్నిహితులను తీసుకుని సీఎం జగన్ ను కలిసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత అసలు మీడియాలోనే కనపడకుండా పోయారు. ఆయన నియోజకవర్గంలో కూడా తిరగడం లేడనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి బెంగళూరులో ఉన్నారని కొందరు అంటుంటే మరికొందరు ఆయన హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు.
అలాగే ఉండవల్లి శ్రీదేవి కూడా ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో ఆమె కూడా బయటకు వెళ్లలేకపోతున్నారు. అమరావతి రైతులకు భూమి కౌలు ఇచ్చినప్పుడు మాత్రం ప్రజల మధ్యకు వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అయితే ఈ నేతలను కలవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అసలు ఇష్టం పడటం లేదు. తాడేపల్లె వెళ్లినా సరే జగన్ వీళ్ళను కలవడానికి సమయం ఇవ్వడం లేదని సమాచారం. అమరావతి రైతుల నుండి వ్యతిరేకత ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనైనా జగన్ ఈ నాయకులను కలవడానికి సమయం ఇస్తారో లేదో వేచి చూడాలి. రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ రాజధాని అంశం వల్ల ప్రభుత్వం, ప్రతిపక్షాలు అభివృద్ధిని , ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాత్రింబగల్లు తమ పంథాన్ని నెగ్గించుకోవడానికి, రాజధాని క్రెడిట్ కోసం ప్రాకులాడుతున్నారు.