టీటీడీకి ఆర్బీఐ 3 కోట్ల జరీమానా.! నవ్విపోదురుగాక.!

తిరుమల తిరుపతి దేవస్థానమంటే.. వెంకటేశ్వరస్వామి సన్నిధికి సంబంధింని వ్యవహారాలు చూసుకునే ఓ సంస్థ. దీన్ని పాలక మండలి అనాలా.? ఇంకేమైనా అనాలా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. దేవాలయానికి భక్తులు విరాళాలు అందిస్తుంటారు. ఆ విరాళాల్ని టీటీడీ, బాధ్యతాయుతంగా మళ్ళీ భక్తుల మీదనే ఖర్చు చేయాలి. ఇదీ పద్ధతి.

ప్రసాదాలు, వెంకటేశ్వరస్వామికి కైంకర్యాలు, భక్తులకు సౌకర్యాలు.. ఇవేనా.? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెంకటేశ్వరస్వామి దేవాలయాలు, అంతర్జాతీయ స్థాయిలో వెంకటేశ్వరస్వామికి కల్పించాల్సిన పబ్లిసిటీ.. ఇదంతా పెద్ద కథ.! కానీ, ఆ టీటీడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వమూ సేవలు పొందుతోంది. ప్రోటోకాల్ పేరుతో అధికార పార్టీ నాయకులు చేసే దందాపై విమర్శలు సర్వసాధారణం. ఏ పార్టీ అధికారంలో వున్నాగానీ, టీటీడీని రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మార్చేయడం చూస్తున్నాం.

ఇప్పుడేమో ఏకంగా మూడు కోట్ల మేర జరీమానా విధించిందట ఆర్బీఐ. దాంతో, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడికి జరీమానా వేయడమేంట్రా.? అంటూ ఆర్బీఐ మీదా.. కేంద్ర ప్రభుత్వం మీదా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన విరాళాలకు సంబంధించి టీటీడీ ఎఫ్‌సిఆర్‌ఎ కాల పరిమితి ముగిసినా తగు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య అన్నది ఓ వాదన. ఎవరి గోల ఎలా వున్నా, దేవుడికి జరీమానా వేయడమేంటి.? దేవుడికి భక్తులు పంపిన విరాళానికి జరీమానా వేయడమేంటి.? మతి లేని రాజకీయం, మతిలేని పాలన. మతిలేని జరీమానా.!