తన ఓటమికి ఆ పత్రిక కారణమని ధర్నాకు దిగిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

తాను ముందస్తు ఎన్నికల్లో ఓడిపోవడానికి ఓ పత్రికానే కారణమని టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆ పత్రికా కార్యాలయం ముందుకు ధర్నాకు దిగారు. ఆ మాజీ ఎమ్మెల్యే ధర్నాకు దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పత్రిక రాసిన వార్తల వల్లనే తాను ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని పుట్ట మధు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏ ఆధారాలతో తన పై తప్పుడు వార్తలు రాసారో చెప్పాలని మధు డిమాండ్ చేశారు.  

వార్త పత్రికలు, న్యూస్ చానల్స్ అంటే ప్రజల్లో అపారమైన గౌరవం ఉందని కానీ నేటి పత్రికలు కొంత  మందికి సొమ్ము కాస్తూ పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. తన అనుచరులతో కలిసి పుట్ట మధు విజయక్రాంతి పత్రిక ఆఫీసు ముందు ధర్నాకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్ధి చెప్పినా కూడా పుట్ట మధు వినలేదు. తాను 1990 సంవత్సరం నుంచి కష్టపడుతున్నానని తాను ఎవరిని మోసం చేసి పైకి రాలేదన్నారు. తన వ్యాపార కార్యకలాపాల ద్వారానే తాను రాజకీయాల్లో ఎదిగానన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు 1 కోటి 9 లక్షల విలువైన ఆస్తులు అమ్ముకున్నానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనుక్కున్నవి 1 కోటి 40 లక్షల రూపాయల ఆస్తులు కొనుకున్నానన్నారు. 

తన పై తప్పుడు వార్తలు రాసి తన ఓటమికి కారణమైన విజయక్రాంతి పత్రిక పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీటన్నింటికి పత్రిక యజమాని సీఎల్ రాజాం బాధ్యత వహించాలన్నారు. తన బంధువు శ్రీధర్ బాబు విజయం కోసం ఏ అండా లేని తన పై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన రాజాం దుర్భుద్ది ప్రజలకు తెలియ జేయాలనే తాను ధర్నా చేస్తున్నానన్నారు. పుట్ట మధు ఏకంగా ఓ పత్రికా కార్యాలయం ముందుకు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది.