పార్లమెంట్ సమావేశాల సంధర్బంగా ఢిల్లిలో టిఆర్ఎస్ ఎంపీలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ విపత్తుగా తయారైందని ఏ పార్టీ ఏం మాట్లాడుతుందో అర్ధం కావడం లేదని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వాన్నే తాము విపత్తుగా పరిగణిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పై ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే…
“తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి చంద్రబాబే కారణం అని చెప్పడం విడ్డూరంగా ఉంది. నిన్న మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు పొత్తు వల్ల ఓడిపోయాం అని అంటున్నారు. కూటమి ఓటమి పట్ల చంద్రబాబు తప్పేమి లేదు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసినప్పుడే కాంగ్రెస్ ఓడిపోయింది. అసెంబ్లీ రద్దు తర్వాతే కూటమి కట్టారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు వచ్చినా మరెవరు వచ్చినా ఖచ్చితంగా టిఆర్ఎస్ గెలిచేది. అదే జరిగింది. ప్రజలు అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ కు పట్టం కట్టారు. కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక కుంటి సాకులు చెబుతున్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదు. టిఆర్ఎస్ ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుందని పట్టం కట్టారు. ఈవీఎంల లొల్లి పెట్టుకుంటే ఒక రాష్ట్రం చూసుకుంటే మూడు రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయని ఈవీఎంల పై మాట్లాడొద్దని కాంగ్రెస్ హైకమాండ్ టిపిసిసిని హెచ్చరించింది. ఇక చేసేదేం లేక కాంగ్రెస్ నేతలు చంద్రబాబు మీదకు తమ ఓటమిని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ఓటమికి చంద్రబాబుకు సంబంధం లేదు.” అని కవిత అన్నారు.
టిఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అంటేనే ఫైర్ అయ్యే వాళ్లు ఆయన పై ఇంత కూల్ గా మాట్లాడడం చర్చనీయాంశమయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్లనున్న సందర్బంగా చంద్రబాబు అవసరం కూడా ముఖ్యమని భావించి కవిత ఈ విధంగా మాట్లాడారా అని అంతా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ గతంలో మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా కేంద్రంలో రాజకీయాలు ఉండాలని అన్నారు. దీంతో టిడిపి అవసరం కూడా ఫెడరల్ ఫ్రంట్ కు ముఖ్యమని టిఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.