ఆయన ఎంపీ. కానీ అంతకంటే ముందే డాక్టర్. ఎంపీగా ఎన్నికైనా కూడా తన వైద్య వృత్తిని ఆయన వదిలిపెట్టలేదు. ఓ వైపు ప్రజా ప్రతినిధిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మరో వైపు వైద్యునిగా పని చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయనే భువనగిరి టిఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఆయన తన పనుల నిమిత్తం నిత్యం ఏదో ఒక ప్రదేశానికి వెళుతుంటారు. అలా వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ లు అయితే తక్షణమే వారికి ప్రాథమిక చికిత్స చేసి వారి ప్రాణాలను కాపాడుతారు. ఇలా ఇప్పటికి చాలాసార్లు అయ్యింది.
శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద రెండు బైక్ లు డీకోనడంతో నాగమణి అనే మహిళకు గాయాలయ్యాయి. అప్పుడే హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళుతున్న ఎంపీ, బూర నర్సయ్య గౌడ్ తన కారును ఆపి ఆమెకు ప్రాథమిక చికిత్ప చేశారు. ఆ తర్వాత అంబులెన్స్ లో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. ఎంపీగా ఉన్నా కొంచెం కూడా గర్వం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్ ను పలువురు అభినందిస్తున్నారు.