కేసీఆర్ వెంట జగన్ ఉంటారా.. అలా చేస్తే ఆంధ్రా ప్రజలు క్షమిస్తారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు అవుతుండగా హైదరాబాద్ రాజధాని కావడం వల్ల తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పాలకులు చేస్తున్న చిన్నచిన్న తప్పులు ఈ పరిస్థితికి కారణమని చాలామంది భావిస్తారు. ఏపీని విడదీసిన విషయంలో కేసీఆర్ పై ఆంధ్రాలోని మెజారిటీ ప్రజలలో కోపం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలను విడదీసిన పాపం ఆయనదేనని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగన్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నా విభజన పాపం మోదీ సర్కార్ ది కాదు కాబట్టి ఏపీ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. మరి జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ కు జగన్ మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు ఇవ్వకూడదనే చాలామంది కోరుకుంటున్నారు.

అయితే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం కేసీఆర్ కు జగన్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నేతలను కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా మోదీని కాదని జగన్ కేసీఆర్ ను సపోర్ట్ చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో జగన్, కేసీఆర్ ఒకరికొకరు సహాయసహకారాలు ఇచ్చారు.

అయితే బహిరంగంగా మాత్రం కేసీఆర్, జగన్ మద్దతు ఒకరికొకరు ఇచ్చుకోవడం జరగలేదు. కేసీఆర్ నిజంగా ప్రధాని అయ్యే పరిస్థితి తలెత్తితే ఆ సమయంలో వైసీపీ ఎంపీల ఓట్లు కీలకమైతే ఆ సమయంలో జగన్ బీజేపీకి మద్దతిస్తారో కేసీఆర్ కు మద్దతు ఇస్తారో చూడాలి. జగన్ కేసీఆర్ కు మద్దతు ఇస్తే ఆంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.