జనసేనపై వైసీపీ ట్రోలింగ్.! వైసీపీకే నష్టం.!

వంగవీటి మోహన రంగా తమ ఇంటికి వచ్చినప్పుడు టీ ఇచ్చానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని వైసీపీ ‘పట్టుకుంది’.! అదేదో జనసేన పార్టీని నిలువునా పాతరేసే అంశం అన్నట్లుగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టింది వైసీపీ. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం నానా యాగీ చేస్తోంది.

అధికార పార్టీ సొంత మీడియాలోనూ ఇదే చర్చ. ఏకంగా ఓ చర్చా కార్యక్రమాన్ని పెట్టి.. మేధావుల్ని తీసుకొచ్చి.. పెద్ద యాగీ చేసి పారేసింది వైసీపీ అనుకూల మీడియా. అసలు అదంత ముఖ్యమైన విషయమా.? అని మీడియా వర్గాల్లోనే ఒకింత ఈసడింపు కనిపిస్తోంది. రంగా టీ తాగడం, తాగకపోవడం.. అన్నది ఆయన వ్యక్తిగతం.

ఇంటికి వచ్చినప్పుడు మర్యాదకి తేనీరు అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. దాన్ని అతిథులు తీసుకుంటారా.? లేదా.? అన్నది వారిష్టం. చిరంజీవి ఇంటికి చాలాసార్లు రంగా వెళ్ళారు. ఈ క్రమంలో వయసులో చిన్నవాడైన పవన్ కళ్యాణ్ టీ ఇచ్చి వుండొచ్చు కూడా. రంగా తాగకపోయి వుండొచ్చు కూడా. చిరంజీవి ఇంటికి రంగా చాలా సార్లు వెళ్ళారనీ, చిరంజీవి కుటుంబంతో ఆయనకు అనుబంధం వుందనీ రంగా సన్నిహితులే చెబుతున్నారు. అసలు ఆ విషయంతో వైసీపీకి ఏంటి సంబంధం.? రంగా అంశాన్ని ప్రస్తావించడం వల్ల వైసీపీకి వచ్చే లాభమేంటి.?

వ్యూహాత్మకంగా వైసీపీని వైసీపీలోనే ఎవరో వెన్నుపోటు పొడుస్తున్నారు. అది వైసీపీ అధినేతకు అర్థం కావడంలేదు. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ సహా పలు అంశాలపై పాజిటివ్ నోట్ జనంలోకి వెళ్ళేలా వైసీపీ మద్దతుదారులు వ్యవహరించాలి. వైసీపీ అనుకూల మీడియా కూడా అదే పని చేయాలి. అందుకు భిన్నంగా జనసేననే పట్టుకుని వేలాడితే.. జనసేన కంటే దిగువ స్థాయికి వైసీపీ పడిపోయే ప్రమాదం లేకపోలేదు.

https://youtu.be/s9ctECdkZog