వున్నపళంగా ఆమె వేరే పార్టీ వెతుక్కోవాల్సిందే. ఔను, నగిరి రాజకీయాలు మంత్రి రోజాకి ఇస్తోన్న సంకేతం అదే మరి.! ‘పార్టీలో వుండటానికి వీల్లేదు..’ అంటూ మంత్రి రోజాకి వైసీపీ శ్రేణులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ‘మళ్ళీ గనుక రోజాకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఓడించి తీరతాం..’ అంటూ వైసీపీ శ్రేణులు తెగేసి చెబుతున్నాయి పార్టీ అధిష్టానానికి.
ఏం జరుగుతోంది నగిరి నియోజకవర్గంలో.? అసలెందుకు మంత్రి రోజాకి నగిరి నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే నిరసన సెగలు ఎదురవుతున్నాయి. సినిమా గ్లామర్ వుంది.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ కూడా వుంది. అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది రోజా పరిస్థితి.
పొమ్మనకుండా పొగ పెడుతున్నారు.. ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తనంతట తానుగా మంత్రి పదవికి రోజా రాజీనామా చేసేలా నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకుగానీ, పార్టీ కార్యక్రమాలకుగానీ రోజాకి ఆహ్వానాలు అందడంలేదట. ఈ విషయమై రోజా బావురుమంటున్నారట సన్నిహితుల వద్ద.
తాజాగా లీక్ అయిన ఓ ఆడియో క్లిప్‌లో అనుచరుల వద్ద రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వైనం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే, రోజాకి మంత్రి పదవి దక్కకుండా నగిరి వైసీపీలో నడిచిన రాజకీయాలేవీ ఆమెను అడ్డుకోలేకపోయాయి. ఆమె మంత్రి అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా నగిరిలో రోజా వైరిపక్షాన్ని వైసీపీ అధినాయకత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు.?