ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావుకు ముగిసిపోయిందనుకున్న పాత కేసు ఒకటి మళ్లీ మెడకు చుట్టుకుంటోంది. అదే మార్గదర్శి కేసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్దంగా రామోజీ రూ.2,600 కోట్ల డిపాజిట్లు సేకరించారని మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసేటప్పుడు ఉండవల్లి మంత్రిగా ఉన్నారు. అప్పట్లో మాజీ ఐజీ కృష్ణంరాజు పిర్యాధులు కూడా చేశారు. బలమైన ఈ కేసును రామోజీ పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని హ్యాండిల్ చేశారు. ఎన్నో లీగల్ కేసులున్నా ఈ మార్గదర్శి కేసు మాత్రం రామోజీని బాగా కంగారుపెట్టింది. ఎలాగైనా కేసు నుండి బయటపడాలనుకున్నా రామోజీరావు 2600 కోట్ల డిపాజిట్లను ఎలాగో తిరిగి చెల్లించేసింది.
తిరిగి చెల్లించినా కూడా నిబంధనలకు విరుద్దంగా డిపాజిట్లు సేకరించారు కాబట్టి ఆరోపణలు నిజమైతే భారీ జరిమానా, జైలు శిక్ష తప్పవు. అందుకే అతి కష్టం మీద కేసును ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో హెచ్‌యుఎఫ్ (హిందూ జాయింట్ ఫ్యామిలీ) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న హైకోర్టు కేసును కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని అస్సలు బయటికి రానివ్వలేదు. ఇతర మీడియా సంస్థలకు సైతం కేసు క్లోజ్ అయినట్టు చిన్న హింట్ కూడా దొరకనివ్వలేదు. ఇలాగే ఒకటిన్నర ఏడాది గడిపారు. అయినా కూడా ఆ గొప్యత దాగలేదు. ఎవరికైతే విషయం తెలియకూడదో వారికే తెలిసిపోయింది.
మొదట్లో ఈ వ్యవహారం మీద ఆరోపణలు చేసిన ఉండవల్లికే కేసు క్లోజ్ అయినట్టు తెలిసిపోయింది. ఇలాంటి కేసు విషయమై వేరే వారితో చర్చల్లో ఉండగా రామోజీ మార్గదర్శి కేసు క్లోజ్ అయినట్టు ఆయనకు కూపీ అందింది. దీంతో మొత్తం సమాచారం రాబట్టుకున్నారు ఉండవల్లి. ఏ చట్టం, ఏ సెక్షన్ల కింద కేసును కొట్టివేశారో తెలుసుకుని మళ్లీ సావదానంగా స్టడీ చేసి కోర్టు తీర్పులో రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) సరిగ్గా అన్వయించలేదని హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇన్నాళ్లు ఈ కేసులో తెలంగాణ మాత్రమే పార్టీగా ఉండగా ఇప్పుడు ఏపీని కూడా ఇంప్లీడ్ చేయాలని ఉండవల్లి పిటిషన్లో కోరారు. ఆ ప్రకారమే సర్వోన్నత న్యాయస్థానం రెండు ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అసలే ఉండవల్లి ఒక్క కేసును పట్టుకుంటే దాని అంతు తేల్చేదాకా వదలరు. అసలు తాను పైచేయి సాధించగలను అంటేనే ఏదైనా వివాదాన్ని పట్టుకుంటారు. అలాంటి వ్యక్తి చేతిలో చిక్కడంతో రామోజీరావుకు ఊపిరి సలపడంలేదట.