అసలే గడ్డుకాలం, ఆదుకునే వారు ఎవరూ లేరు.. వీటికి తోడు పార్టీలో తయారవుతున్న అసంతృప్త శక్తులు.. వెరసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పార్టీని నిలబెట్టుకోవడం తలకు మించిన భారంగా పరిణమించింది. ఆ భారమే ఓటమికి ఏనాడూ కుంగిపోని చంద్రబాబును ఈసారి కుంగిపోయేలా చేస్తోంది. బయటి నుండి ప్రమాదాలు ఎలా ఉన్నా పార్టీలో పుట్టే తుఫానులు ఎక్కడ ముంచేస్తాయోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ దక్కించుకున్న అసెంబ్లీ స్థానాలు కేవలం 23. ఈ సంఖ్య చూశాక ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడైనా బేజారెత్తాల్సిందే. కానీ సీబీఎన్ తట్టుకున్నారు. ఉన్న 23 మందితోనే సైకిల్ నడపడానికి సిద్దమయ్యారు.
కానీ అనూహ్యంగా ఎమ్మెల్యేల్లో అనిశ్చితి మొదలైంది. ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు ఇప్పటికే అనధికారికంగా టీడీపీ కి దూరమై వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లోనే ఈ సంగతి రూఢీ అయింది. మిగిలిన 20 మందిలో గంటా శ్రీనివాసరావు మాదిరి ఉందామా బయటికి పోదామా అనే మీమాంసలో ఉన్న నేతలు ఒక ఐదుగురు ఉంటారట. వీరిని తీసేస్తే మిగిలింది 15 మంది. సరే వీరైనా చంద్రబాబు పక్షాన నిలబడతారా అంటే అవునని నమ్మకంగా చెప్పలేం. కొందరు ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా సిట్యుయేషన్ అంటూ వస్తే ఉంటారో ఎగిరిపోతారో అని పార్టీ శ్రేణుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చంద్రబాబు వెనుక నిలిచేది, ఎంతవరకైనా నడిచేది ఎవరయా అంటే నమ్మకంగా ఒక పది మంది పేర్లు వినబడుతున్నాయి. వారిలో సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప లాంటి వారితో పాటి అనగాని సత్యప్రసాద్, ఆడిరెడ్డి భవానీ, ఏలూరి సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణ, నిమ్మల రామానాయుడు, జోగేశ్వరరావు ఉన్నారు. వీరి మీద బాబుగారికి మంచి గురి ఉందట. కానీ ప్రజెంట్ రాజకీయ వాతావరణం, పార్టీలోని పరిస్థితులు, బయటి నుండి ప్రభావితం చేస్తున్న శక్తులను బట్టి చూస్తే ఆ పది మంది ఆలోచనల్లో మార్పు రావడానికి ఎంతో సమయం పట్టదు. ఆ పరిస్థితులు రాకుండా చూసుకొంటుండటం విపక్ష నేతకు మాడునొప్పి పుట్టేలా చేస్తోందట.