తిరుపతి గర్జనకు వైసీపీ కసరత్తులు.! ఈసారైనా హిట్టు కొట్టేనా.?

లక్షలు వెచ్చించి జనాన్ని తరలించే ప్రక్రియ కాకుండా, స్వచ్ఛందంగా జనాన్ని రప్పించే ఆలోచనలు చేయలేకపోతోంది అధికార వైసీపీ. అది కూడా ‘గర్జన’ లాంటి కార్యక్రమం విషయంలో వైసీపీ, షరామామూలు పొలిటికల్ ఫార్ములా అనుసరిస్తే సరిపోదు.!

విశాఖ వేదికగా గర్జన జరిగింది. ‘ఒక్క రాజధాని అమరావతి వద్దు.. అమరావతితో కూడిన మూడు రాజధానులు ముద్దు’ అంటోంది వైసీపీ. ఇదే నినాదంతో గర్జన నిర్వహించింది వైసీపీ. నాన్ పొలిటికల్ జేఏసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైసీపీ చెబుతున్నా, దాన్ని నడిపించేది వైసీపీనే.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ గర్జన వెనుకాల అన్నీ తానే అయి నడిపించారు. ఆయనా ప్రత్యక్షంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు రోజా, మాజీ మంత్రులు, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి జనాన్ని తరలించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, వైసీపీ శ్రేణుల్ని సమన్వయం చేసుకోవడంలోనే అధికార పార్టీ బొక్కబోర్లా పడింది.

ఈసారి గర్జన వేదిక తిరుపతికి మారింది. ఉత్తరాంధ్ర లాగానే రాయలసీమ ప్రాంతం కూడా ప్రజా చైతన్యానికి కేరాఫ్ అడ్రస్. కానీ, ఏం లాభం.? మూడు రాజధానుల వ్యవహారానికి రాయలసీమ నుంచి రావాల్సిన స్పందన రావడంలేదు. ‘ఒక్క రాజధానినే అయోమయంలో పడేశారు.. మూడు రాజధానులెలా చేస్తారు.?’ అంటూ జనంలో ఓ బలమైన అభిప్రాయం నాటుకుపోయింది.

రాయలసీమ వెనకబాటుతనం అనేది పాత మాటే. రాయలసీమ నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ ఎక్కువమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఈ నేపథ్యంలో రాయలసీమ వెనకబాటు తనం.. అంటే, ఆ పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి, ఏం చెప్పి.. జనాన్ని వైసీపీ తిరుపతి గర్జనకు రప్పిస్తుంది.? వేచి చూడాల్సిందే.