తెలుగుదేశం పార్టీ వలసలతో బెంబేలెత్తిపోతోంది. ఒకప్పుడు అధికారంలో ఉండగా ప్రతిపక్షం వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు తనకు మిగిలిన 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే వాల్ళభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, కరణం బలరాం లాంటి నాయకులు టీడీపీని వీడిపోగా మిగిలిన 19మందితో బండి లాక్కొస్తున్నారు అయన. వారిలో కూడ గంటా శ్రీనివాసరావు, గణబాబులు జెండా పీకడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలొస్తున్నాయి. వీరిద్దరి కంటే ముందు ఒక ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఘనంగా వినబడ్డాయి. వారే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ.
వీరిద్దరూ అధిష్టానం మీద కులంగా ఉన్నారనే టాక్ గట్టిగా వచ్చింది. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడినా పయ్యావుల కేశవ్ మాత్రం గెలుపొందారు. దాంతో బాబు ఆయన మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. సీమ ప్రాంతం నుండి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు కాబట్టి జగన్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడతారని ఆశలు పెట్టుకున్నారు. అశలైతే పెట్టుకున్నారు కానీ ప్రాముఖ్యత ఇవ్వలేదు. పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనడం తగ్గించేశారు. సీమలో కొన్ని సంచలన రాజకీయ విషయాలు జరిగినా నోరు మెదపలేదు. జేసీ అరెస్ట్, అచ్చెన్నాయుడు అరెస్ట్ మీద కూడ మాట్లాడలేదు. దీంతో ఆయన పార్టీని వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం గట్టిగా జరిగింది. 2014 ముందు ఇలాంటి వార్తలే వస్తే స్పందించిన అయన ఈసారి మాత్రం స్పందించలేదు. దీంతో ఆయన జంప్ అవ్వడం ఖాయమనుకున్నారు.
ఇక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మొదటి టీడీపీలో ఉండి తర్వాత వైసీపీకి వెళ్లి మళ్ళీ తిరిగి టీడీపీలోకే వచ్చారు. రీఎంట్రీ ఇచ్చి టికెట్ అయితే పొందగలిగారు కానీ చంద్రబాబు నుండి పూర్తిస్థాయిలో సహకారం కరువైందని, పైగా రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి, భవానీకి అస్సలు పొసగడం లేదని చెప్పుకునేవారు లోకల్ లీడర్లు. వీటికి తోడు రాజ్యసభ ఎన్నికల్లో భవానీ టీడీపీ తరపున చెల్లని రీతిలో ఓటు వేశారు. అవగాహన లోపం వలన అలా జరిగిందని ఎమ్మెల్యే అంటున్నా హైకమాండ్ దీన్ని తీవ్రంగానే పరిగణించడం, సమీప బంధువైన అచ్చెన్నాయుడు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కాగా ఆయనకు పార్టీ నుండి సపోర్థ్ అందవలసిన స్థాయిలో అందకపోవడంతో భవానీ, ఆమె భర్త అసహనంగా ఉన్నారని అందుకే పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది.
కానీ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలతో ఈ అనుమానాలు పటాపంచలైపోయాయి. పయ్యావుల కేశవ్, ఆదిరెడ్డి భవానీ ఇద్దరూ టీడీపీ తరపున పాలక పక్షాన్ని ఎదుర్కొన్నారు. సభ నుండి సస్పెండ్ అయ్యారు. పార్టీని వీడేవారే అయితే సభలో వైసీపీకి, జగన్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా. అందుకే వారిద్దరూ తెలుగుదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఈ సమావేశాలతో తేలిపోయినట్టైంది. టీడీపీ కార్యకర్తలు కూడ సభలో పోట్లాడి, సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను చూసి హమ్మయ్య వీళ్లంతా పార్టీలోనే ఉన్నారులే అంటూ ఊపిరిపీల్చుకున్నారు కూడ.