వైఎస్ జగన్ మాత్రమే కాదు యావత్ ప్రభుత్వమూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విధాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వం వద్దని అంటున్నా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేయడం పెద్ద అపరాధమని, దానివెనుక పెద్ద కుట్ర దాగివుందని చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసింది తప్పా ఒప్పా, ఏపీ ప్రభుత్వానిదే న్యాయమైన వాదనా అనేది పక్కనబెడితే నిమ్మగడ్డ మీద వైసీపీ నాయకులకే కాదు ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులకు కూడ ఒకేలాంటి అభిప్రాయం ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక వ్యక్తి మీద లేదా ఒక విషయం మీద 100 మందిలోనూ ఒకే తరహా భావన ఉండటం ఎంతవరకు సాధ్యం. ఒక్కరంటే ఒక్కరు కూడ వేరుగా ఆలోచించరా.
నిమ్మగ్గడ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వైసీపీ నాయకులంటే రాజకీయం కాబట్టి తమ నాయకుడి నిర్ణయాలను వెనకేసుకొని రావాలి కాబట్టి అలా చేయకపోతే ఇబ్బందులుపడాల్సి వస్తుంది కాబట్టిఈసీ మీద మండిపడిపోతున్నారు. ఎవరికివారు మైక్ పుచ్చుకుని అధినేత అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. కానీ ప్రభుత్వంలోనే అధికారులు కూడ అలాగే చేస్తేనే చూడటానికి ఏదోలా ఉంది. ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇద్దరూ కూడ వివాదాన్ని కేవలం ప్రభుత్వం వైపు నుండే ఆలోచిస్తూ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్నారు.
అంతేకానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘానికి, ఎన్నికల కమీషనరుకు సొంతగా నిర్ణయాలు తీసుకునే వీలుందని, వారిని ప్రభుత్వంతో సంబంధం లేదని, ఎన్నికల నిర్వహణ అనేది వారి పరిధిలోని విషయమని, ఎన్నికలు పెట్టాలి అన్నప్పుడు ప్రభుత్వం సహకరించి తీరాలి అనే విషయాలను ఆలోచించట్లేదు. ఈ పద్దతి చూస్తుంటే నిమ్మగడ్డ చంద్రబాబు నాయుడు మాట వింటున్నారో లేదో తెలీదు కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం పూర్తిగా ముఖ్యమంత్రి మాటే వింటున్నారని అనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే సాగితే ప్రభుత్వమే నష్టపోవాల్సి ఉంటుంది.