రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేసిన అధికారులకు ప్రభుత్వం భవిష్యత్ భరోసా ఇస్తుంది. వారందరికీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ముఖ్యమైన పోస్టింగ్ లు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని మొత్తం వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై అభిశంసన చేయాలన్న నిమ్మగడ్డ సిఫార్సులను సయితం ప్రభుత్వం పక్కన పెట్టింది.
చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు భరత్ గుప్తా, శామ్యూల్ ఆనంద్ లను బదిలీ చేయమని ఆదేశించడంతో వారిని బదిలీ చేసింది. వెంటనే వారు ఖాళీగా ఉండగా ముఖ్యమైన పదవుల్లో వారిని ప్రభుత్వం నియమించడం విశేషం. అధకారులపై చర్యలకు సిఫార్సు చేయడం ద్వారా నిమ్మగడ్డ వారిపై చర్యలకు సిఫార్సుచేస్తే జగన్ ప్రభుత్వం మాత్రం వారికి రక్షణ కల్పించే దిశగాప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ చేసిన వారికి ముఖ్య పదవులు ఇస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
జగన్ తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇరుకున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తెలంగాణలో ఉన్నప్పటికీ ఏపీకి రప్పించి ముఖ్యమైన మున్సిపల్ శాఖ పదవి ఇవ్వడమే కాకుండా పదోన్నతి ఇచ్చిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులపై చర్యలకు దిగి వారిని కట్టడి చేయాలనుకుంటే ప్రభుత్వం వారిని కొద్ది కాలం కూడా ఖాళీగా ఉంచకుండా వెంటనే పోస్టింగ్ లు ఇవ్వడం అధికారుల్లో భరోసా కల్పించడంలో భాగమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మహా అయితే మూడు నెలలు ఎన్నికలు ఉంటాయి. తర్వాత తమ ప్రభుత్వం మూడేళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న సంకేతాలను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అధికార వర్గాల్లోకి పంపగలిగాయి. మొత్తం మీద అధికారులు అధైర్యపడకుండా జగన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందనే చెప్పాలి.