ఎవరా ఘరానా మోసగాడు? ఎవరా అజ్ఞాతవాసి? నేరుగా ఎమ్మెల్యే విడదల రజనీనే ఎందుకు టార్గెట్ చేసాడు? మాటల్లో పెట్టి దేనికోసం యామర్చాలనుకున్నాడు? వైసీపీలో అంత మంది లేడీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండగా రజనీనే ఎందుకు టార్గెట్ చేసినట్లు? డబ్బు కోసమే అయితే ఆమెనే ఉందుకు మాటల్లో పెట్టదలిచాడు? అవును ఇప్పుడీ ప్రశ్నలు చిలకలూరి పేట సహా రాష్ర్టంలో సంచలనంగా మారాయి. ఇంతకీ ఎవరా ఘరానా దొంగ..ఏమా కథ! అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీని ఓ సైబర్ మోసగాడు మాటల్లో పెట్టి కోట్లు నొక్కేయాలని చూసాడు.
కానీ రజనీ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహారించి ఆ ఘరానా దొంగను పోలీసులకు పట్టించి ఆ దొంగకే దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. విడదల రజనీకి భారీ మొత్తంలో బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తానని ఫోన్ చేసి నమ్మబలికే ప్రయత్నం చేసాడు. నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని..సీఎం జగన్ మీతో మాట్లాడలని ఆదేశాలిచ్చినట్లు రజనీకి చెప్పాడు. అలా కాసేపు మాటల్లో మాట కలిపాడు. ఆ మాటల్లోనే బ్యాంకు నుంచి భారీగా రుణాలు ఇప్పిస్తాననన్నాడు. అయితే దానికి కొంత మొత్తం చెల్లించాలన్నాడు. ఈ నేపథ్యంలో అతని కాల్ పై అనుమానం వచ్చిన విడదల రజనీ రివర్స్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
విశాఖకు చెందిన జగజ్జీవన్ పేరుతో సీఎం కార్యాలయంలో ఎవరైనా పనిచేస్తున్నారా? అని లైన్ లో ఉండగానే వివరాలు ఆరా తీసారు. దీంతో అది ఫేక్ అని తెలియడంతో రజనీ చాకచక్యంగా వ్యవహరించారు. ఫోన్ మాట్లాడుతూనే డీజీపీతో పాటు గుంటూరు అర్బన్ ఎస్పీ సహా ఇతర పోలీస్ సిబ్బందికి విషయాన్ని చేరవేసారు. అదే స్పీడ్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయించారు. కట్ చేస్తే కాల్ పూర్తయ్యేలోపు పోలీసులు ఎంట్రీ..అటుపై ఆ ఘరానా సైబర్ నేరగాడ్ని కటకటాల పాలు చేయడం జరిగింది. అనంతరం మరింత విచారించగా ఆ మోసగాడి బండారం మొత్తం బయట పడింది. అంతేగా ! తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాళ్లుంటారని మరోసారి విడదల రజనీ నిరూపించారు.
గతంలో ఎమ్మెల్సీ జికాయా ఖాన్ ని కూడా ఇలాగే మోసం చేయాలని చూసినట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు త్వరలోనే ఆ మోసగాడ్ని మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరణ ఇవ్వనున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు నేరుగా పొలిటీషన్లని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య తెలంగాణ లో ఓ కాంగ్రెస్ సీనియర్ నేతకి ఇలాంటి కాల్ ఆర్బీఐ నుంచి వస్తున్నట్లు ఓ సైబర్ నేరగాడు నమ్మబలికిన సంగతి తెలిసిందే. విషయం గ్రహించిన సదరు నేత వెంటనే అప్రమత్తమై ఆ మోసగాడి ఆట కట్టించాడు.