ప్రెస్‌మీట్ లో కంటతడి పెట్టిన విజయమ్మ

వైఎస్ జగన్ పై దాడి తర్వాత వైఎస్ విజయమ్మ మొదటి సారి మీడియాతో మాట్లాడారు. జగన్ కత్తి దాడి నుంచి కోలుకోవడం పునర్ జన్మ అని ప్రజలందరి ఆశీస్సులతోనే జగన్ ప్రాణాలతో బయటపడ్డారన్నారు.

2009 లో రాజశేఖర్ రెడ్డి దూరమైనప్పటి నుంచి తమ కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి పార్టీని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి మరణ తర్వాత తమను పట్టించుకోలేదన్నారు. తన తండ్రి ఆశయాల సాధన కోసమే జగన్ పార్టీ పెట్టారని ప్రజల మనిషి అయ్యారన్నారు.  రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రాన్ని తన కుటుంబంలా చూసుకున్నారని కానీ నేడు తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సహకరించే వారు లేరని విజయమ్మ అన్నారు.

ఈడి కేసులు, సిబిఐ కేసులతో వేధించారని జగన్ ను 16 నెలలు జైల్లో ఉంచి తమను మానసికంగా దెబ్బ తీశారన్నారు. అప్పటి వరకు లేని కేసులు అప్పడే ఎలా వచ్చాయని విజయమ్మ ప్రశ్నించారు. కొంత మంది చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. తల్లిని, చెల్లిని, భార్యను కూడా వివాదాలలోకి లాగి అవమానపరుస్తున్నారని విజయమ్మ కంటతడి పెట్టారు. అందరిలో చాలా అవమానాలను ఎదుర్కొని ఒపికగా భరిస్తూ వస్తున్నామని విజయమ్మ  అన్నారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా చెక్కు చెదరకుండా జగన్ ఉన్నారని ప్రజలే ఆయన బలం  అన్నారు. చివరకు భారతిని కూడా ఈడి కేసులలోకి లాగాలని చూస్తున్నారని ఇంత దుర్మర్గమా వ్యవస్థ అని ఆమె నిలదీశారు. జగన్ పై దాడి జరిగి 15 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఎందుకు కేసు విచారణ ముందుకు సాగటం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసులు అంతా కూడా గాయం లోతు గురించే మాట్లాడుతున్నారు  కానీ జగన్ భద్రత గురించి మాట్లాడటం లేదని విచారణను వెంటనే పూర్తి  చేయాలని విజయమ్మ అన్నారు.

అబద్దపు లేఖలు సృష్టించి నాటకమాడుతున్నారన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఎటువంటి కుట్ర లేదనడం సిగ్గు చేటన్నారు. ఎయిర్ పోర్టులోకి గుండు పిన్నును కూడా అనుమతించరు అటువంటిది కత్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. నిజంగానే జగన్ కు జరగరానిది జరిగితే పరిస్థితేంటని ఆమె ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో జగన్ బయటపడ్డారని విజయమ్మ అన్నారు.

తన బిడ్డ తండ్రిని కోల్పోయిన బాధలో కూడా ప్రజలను ఓదార్చడానికి బయలు దేరాడన్నారు. జైల్లో ఉన్న 16 నెలలు తప్ప మిగతా కాలమంతా జగన్ జనం మధ్యనే ఉన్నారని ఆమె గుర్తు  చేశారు. 2009 నుంచి తమ కుటుంబం నిత్యం నరకం అనుభవిస్తుందన్నారు.  ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అభిమానంతో జగన్ ముందుకే వెళుతారు కానీ  వెనకకు వెళ్లరని విజయమ్మ అన్నారు.

తన బిడ్డను ఆరోజు మీకేలా అప్పగించానో నేడు కూడా అలానే మీకు అప్పగిస్తున్నానని సోమవారం నుంచి తిరిగి జగన్ పాదయాత్ర చేయనున్నారని విజయమ్మ తెలిపారు. ప్రజలంతా ఆశీర్వదించాలని, జనం కోసమే జగన్ బ్రతుకుతున్నాడని విజయమ్మ అన్నారు.