దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. అంతా బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడా కొందరికి అస్వస్థత కలుగుతోంది. ఇలానే వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళా వాలంటీర్ మృతి చెందడం కలకలం రేపింది. వ్యాక్సిన్ వికటించడం వల్ల తమ బిడ్డ మృతి చెందిందని తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిందీ ఘటన. అయితే ఏపీ ప్రభుత్వం స్పందించి ఆమె కుటుంబానికి 50 లక్షల పరిహారం విడుదల చేసింది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలిత తో పాటు ఎనిమిది మంది వాలంటీర్లు, స్థానిక వీఆర్వో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. అయినప్పటికీ లలిత మృతి చెందారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పరాజు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం ఆమె కుటుంబానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రిన్సిపల్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.