ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా బలం పుంజుకుని అధికారంలోకి రావాలని రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వం కలలు కంటుంటే… కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. అధికారమే ధ్యేయంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో బీజేపీ పార్టీ ముందుకుసాగుతుంది. వైసీపీ, టీడీపీ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటాయే తప్పా అభివృద్ధి చేయవని, వారికి ప్రత్యామ్నాయం తామే అని ప్రచారం చేస్తున్నారు కమలనాథులు. కానీ రాష్ట్ర నేతలు కంటున్న కలలకు కేంద్రం నుంచి బ్రేకులు పడుతున్నాయట.
చాలా విషయాల్లో రాష్ట్ర ప్రజల మనోభావాలకు విరుద్ధమైన నిర్ణయాలు కేంద్రం తీసుకుంటోందట. రాష్ట్రం పట్ల ఏ కోణంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం సానుభూతితో లేదన్న ఫీలింగ్ కలుగుతోందట. అందుకే బీజేపీ నేతలు కంగారుపడుతున్నారట. దేశం మొత్తానికి కలిపి ప్రకటించే పథకాలు తప్పించి ఏపీ కంటూ ప్రత్యేకంగా ఇదిగో…ఇది… అని చెప్పడానికి, స్థానిక నేతలు ప్రచారం చేసుకోడానికి పెద్ద అంశాలు లేవనేది ఓ ఆరోపణ. అవి తమకు ఇబ్బందిగా మారాయని బీజేపీ నేతలు వాపోతున్నారట. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాల నుంచి కోలుకోవటానికి దారులు వెతుక్కుంటున్న బీజేపీకి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నెత్తిన బండ వేసినట్టు అయ్యింది.
ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా? లేదా? అని పక్కన పెడితే…. రాష్ట్రం అంతా బీజేపీని దోషిగా చూస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక బృందంలా వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే రాష్ట్రంలో తమ పరిస్థితి ఏం అవుతుందో అని మొరపెట్టుకుంది. కానీ అనుకూల వైఖరి ఏదీ కేంద్రం నుంచి రాలేదు. ప్రైవేటీకరణ జరిగితే ఎలా ప్రజల ముందుకి వెళ్లాలని బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారట. ఇలాగైతే పార్టీని ముందుకు నడిపించటం కష్టమని సరైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని రాష్ట్ర అగ్ర నాయకుల మీద వత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం.