తెరపైకి రెండు ఆఫర్లు… ముద్రగడ పద్మనాభం ఎంట్రీకి రంగం సిద్ధం!

ఏపీ ఎన్నికల్లో ఈదఫా ఎస్సీ, బీసీ ఓటర్లతో పాటు కాపు ఓటర్లు కీలక భూమిక పోషించబోతున్నారని తెలుస్తుంది. అయితే టీడీపీతో జనసేన పొత్తు నేపథ్యంలో కాపు ఓట్లు పూర్తిగా విపక్షాల పొత్తుకు పడవనే చర్చ మొదలైంది. ఈ సమయంలో ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో కాపుల ఓట్లపై అధికార వైసీపీ దృష్టి సారించిందని తెలుస్తుంది. ఈ క్రమంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు రెడ్ కార్పెట్ పరిచిందని, త్వరలో ఆయన దానిపై నడుచుకుంటూ వెళ్లి ఫ్యాన్ కిందకు చేరతారని తెలుస్తుంది.

అవును… కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరికకు రంగం సిద్దమవుతోందని తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర సమయలో ఫుల్ యాక్టివ్ అయినట్లు కనిపించిన ముద్రగడ పద్మనాభం… అధికార పార్టీలో చేరినప్పటికీ ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపడటం లేదు కానీ… ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావుకు టికెట్ కేటాయించేందుకు చర్చలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తుంది.

ఎవరు అవునన్నా.. మరెవరు కాదన్నా.. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గంలో ముద్రగడ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం! అలాంటి ముద్రగడతో గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో చంద్రబాబు, తాజాగా నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ పొలిటికల్ తగాదా పెట్టుకున్న సంగతి తెలిసిందే! దీంతో… ఈ ఇద్దరు నేతలపైనా ముద్రగడ తనదైన శైలిలో ఫైరవుతుంటారు.

ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులకు అధికార పక్షం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి ఇప్పటికే చర్చలు జరిపారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ముద్రగడ వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారని అంటున్నారు. అయితే కొడుకు చల్లారావు రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిన అనంతరం కండువా కప్పుకుంటే బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో… ముద్రగడ చల్లారావు విషయంలో అధికార పార్టీ రెండు ఆప్షన్స్ ఆలోచిస్తుందని తెలుస్తుంది. ఇందులో ఒకటి ఎంపీ సీటు కాగా.. మరొకటి ఎమ్మెల్యే సీటు!

అందులో భాగంగా… ముద్రగడ పద్మనాభం కుమారుడికి కాకినాడ ఎంపీ.. లేదా పెద్దాపురం ఎమ్మెల్యే టిక్కెట్స్ కన్ ఫాం చేయొచ్చని తెలుస్తోంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో గోదావరి జిల్లా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయని తెలుస్తుంది.

గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసిన తోట వాణి స్ధానంలో ఈసారి ఆమె భర్త తోట నర్సింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారని తెలుస్తున్న నేపథ్యంలో.. పెద్దాపురం సీటులో ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లారావు కు అవకాశం ఉండోచ్చని అంటున్నారు. మరోపక్క కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను రాబోయే ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారని తెలుస్తుండటంతో… ఆ టికెట్ కేటాయించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.