దటీజ్ జగన్..కత్తిపోటు తర్వాత కూడా అదే చిరునవ్వు

 తనపై హత్మాయత్న జరిగినా చలించకుండా చిరునవ్వుతోనే విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు చేరుకున్న జగన్ పై పార్టీ నేతలు,  శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ కు చేరుకునేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ కు  చేరుకున్న జగన్ పై లాంజిలో క్యాంటిన్ వెయిటర్ శ్రీనివాస్ హత్యాయత్నం  చేశారు. కోళ్ళపందేలకు వాడే కత్తితో జగన్ పై జరిపిన దాడిలో ఎడం భుజం క్రింద పెద్ద గాయమే అయ్యింది. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కత్తి తీసి దాడి చేయబోవటాన్ని చివరి నిముషంలో గమనించిన జగన్ పక్కకు తప్పుకోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

కత్తితో జగన్ పై దాడిని గమనించిన విమానాశ్రయ సిబ్బంది శ్రీనివాస్ ను పట్టుకున్నారనుకోండి అది వేరే సంగతి. ఘటన జరగ్గానే విమానాశ్రయ అధికారులు అందుబాటులో ఉన్న వైద్యులను పిలిపించి ప్రాధమిక చికిత్స చేయించారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి పూర్తిస్ధాయి చికిత్స చేయించాలని వైద్యులు చెప్పినా జగన్ వినిపించుకోలేదు. ప్రాధమిక చికిత్సతోనే జగన్ హైదరాబాద్ కు వచ్చేశారు. ఘటన జరిగిన తర్వాత కూడా సుమారు అర్ధగంట పాటు విశాఖ విమానాశ్రయంలోనే ఉన్నారు. తన చుట్టు పక్కల ఉన్న వారెవరూ ఆందోళనపడకుండా వారిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూనే ఉన్నారు.

ఎప్పుడైతే జగన్ పై దాడి జరిగిందో వెంటనే మీడియాలో ఆ విషయం విస్తృతంగా ప్రచారం మొదలైపోయింది. దాంతో జగన్ పై దాడి ఘటన టివిల్లో మారుమోగిపోయింది. దాంతో విశాఖపట్నం నుండి జగన్ హైదరాబాద్ కు చేరుకునేటప్పటికి శంషాబాద్ విమానాశ్రయంలో కొన్ని వేలమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్న ప్రయాణికులు కూడా విషయం తెలుసుకోవటంతో ఆందోళన పడ్డారు.

దానికి తోడు విశాఖపట్నం నుండి హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకుంటున్నారు అని తెలుసుకున్న ప్రయాణీకులు పెద్ద ఎత్తున జగన్ ను చూసేందుకు లోకల్ అరవైల్స్ ఎంట్రన్స్ దగ్గర గుమిగూడారు. విమానం దిగిన జగన్ నొప్పిని భరిస్తూనే తనను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున గుమిగూడిన వారిని అదే చిరునవ్వుతో పలకరించటం గమనార్హం. అందుకే జగన్ అభిమానులు దటీజ్ జగన్ అని చెప్పుకుంటున్నారు.