కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఏకైక దిక్కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనా.? ఆ దిశగానే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్ని అప్పగించనుందా.? ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశంలో తేలిందేంటి.? ఈ ప్రశ్నల చుట్టూ ఆసక్తికరమైన చర్చ ఏపీతోపాటు తెలంగాణ రాజకీయాల్లోనూ జరుగుతోందంటే, కాంగ్రెస్ పార్టీ ఇంకా తన ఉనికిని చాటుకుంటున్నట్లే భావించాలేమో. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. తెలంగాణలో మాత్రం ముక్కీ మూలిగీ.. అన్నట్టు నడుస్తోంది ఆ పార్టీ. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక తెలంగాణ కాంగ్రెస్ తీరు మారిందనే చెప్పాలి. అదే రీతిలో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవాలంటే ఆ స్థాయి అగ్రెసివ్ నేచర్ వున్న నాయకుడు తమ పార్టీకి కావాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన.
అందుకనే, కిరణ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారట. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. సమైక్యాంధ్ర నినాదంతో పార్టీ పెట్టి, ఉనికిని చాటుకోలేకపోయారాయన. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వున్నారు.. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. కాదు, కాంగ్రెస్ పార్టీనే ఆయన్ని తిరిగి అక్కున చేర్చుకుంది. ఇప్పుడాయన గనుక కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకునే అవకాశం వుందనే అభిప్రాయం ఏపీ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ, అదంత తేలిక కాదు. ఎందుకంటే, కిరణ్ కుమార్ రెడ్డి.. ఛరిష్మా వున్న నాయకుడు కాదు. పైగా, ఆయన కూడా పార్టీ పగ్గాల పట్ల అంత ఆసక్తి చూపుతున్నట్టు లేరు. అయితే, మాజీ కాంగ్రెస్ నేతలు కొందర్ని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తున్న దరిమిలా.. ఆ ప్రయత్నాలు ఫలిస్తే, అది కిరణ్ కుమార్ రెడ్డికి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశముంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది కల్ల. కాకపోతే, నాలుగు సీట్లు దక్కించుకోవడానికి ఈ ప్రయత్నాలు ఉపయోగపడొచ్చు.