సేల్ఫీ తెచ్చిన తంటా…జలపాతంలో గల్లంతైన యువకుడు?

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఇలా అనుకోని పరిణామాల వల్ల కొంతమంది క్షణాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నదులు, జలపాతాలు చూడటానికి వెళ్ళిన చాలామంది ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇలా ప్రమాదవశాత్తూ నీటిలో పడి మరణించాడు. ఈ విషాదకర ఘటన కనకపుర తాలూకాలోని పర్యాటక కేంద్రం చుంచి ఫాల్స్‌ వద్ద చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకోవటానికి వెళ్ళిన యువకుడు ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు.

వివరాలలోకి వెళితే…బెంగళూరు శంకరమఠం ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ చంద్ర (26) అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అధిక వర్షాల వల్ల కనకపుర తాలూకాలో ఉన్న చుంచు వాటర్ ఫాల్స్ వద్ద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నట్టంతో ఇటీవల తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం రోజున చుంచు ఫాల్స్ చూడటానికి వెళ్ళాడు. సాధారణంగా ఇప్పుడు అందరూ ప్రతి చిన్న విషయాన్ని సెల్ఫీల రూపంలో జ్ఞాపకంగా మార్చుకుంటున్నారు. ప్రవీణ్ చంద్ర కూడా వాటర్ ఫాల్స్ వద్ద బండరాయి పై నిల్చొని సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలు జారీ 18 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలో పడిపోయాడు.

ప్రవీణ్ ఇలా పడిపోవడంతో అతని వెంట వచ్చిన స్నేహితుల ప్రవీణ్ కోసం చాలా సమయం వెతికిన కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు సాతనూరు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాల్ల సహాయంతో ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రవీణ్ చంద్ర ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.