ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరంగంలోనూ ప్రజలకు విద్యార్థులకు సరైన విధంగా సేవలు అందించడం కోసం అన్ని ప్రభుత్వాలు పలు కట్టిన ఆంక్షలు విధించి ఉద్యోగుల చేత పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వచ్చి రిజిస్టర్లో సంతకం చేస్తే తాను విధులకు హాజరైనట్టు లెక్క.అయితే ప్రస్తుతం బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ యాప్స్ రావడం వల్ల తప్పనిసరిగా వాళ్లు ఆన్లైన్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా విధులకు హాజరైనట్టు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విధంగా పలు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల కొందరు ఉద్యోగస్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…హిందూపురానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ టీచరుగా పనిచేస్తున్నారు. అయితే ఆయన దేవుడి మొక్కు నిమిత్తం పావగడ శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్లి గుండు గీయించుకున్నారు.
ఇక మరుసటి రోజు యధావిధిగా విధులకు హాజరై ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా తను విధులకు హాజరైనట్టు నిరూపించుకోవాలని చూశారు అయితే తను గుండు గీయించుకోవడం వల్ల ఫేస్ నాట్ రికగ్నైజ్ అంటూ చూపిస్తోంది. అయితే ఈ విషయం టీచర్ ఆదినారాయణ తోటి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి మీడియా ముందుకు వెళ్లడంతో కొందరు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు.ఇలా మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ఉన్నతాధికారులు టీచర్ ఆదినారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధమైనటువంటి సాంకేతిక లోపం ఉంటే ముందు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలా మీడియా ముందుకు తీసుకెళ్లడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా డిఇఓ మీనాక్షి ఏకంగా టీచర్ ఆదినారాయణకు మెమో ఇష్యూ చేస్తూ అతనిని సస్పెండ్ చేశారు.దీంతో పలువురు సమస్య వచ్చింది అంటే పరిష్కారం చేయకుండా ఇలా సస్పెండ్ చేయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.