కర్నూలులోనే ఏపీ హైకోర్టు.. కేంద్రం సూచనలతో వైసీపీ నేతలు అలా చేస్తారా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో పూర్తిస్థాయిలో వెనక్కు తగ్గే అవకాశాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు వల్ల కొన్ని నెలల క్రితం జగన్ మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గినా ప్రస్తుతం కర్నూలుకు ఏపీ హైకోర్టును తరలించే దశగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఈ డిక్లరేషన్ లో రాయలసీమలో హైకోర్టును పెడతామని చెప్పడం ప్రధాన అంశం కావడం గమనార్హం.

తాజాగా హైకోర్టు తరలింపుకు సంబంధించి కేంద్రం నుంచి క్లారిటీ వచ్చింది. వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ అడిగిన ప్రశ్నల గురించి కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో హైకోర్టును తరలించాలనే ప్రతిపాదన తనకు అందిందని ఆయన చెప్పారు. ఏపీ సర్కార్ హైకోర్టుతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత తరలింపు ప్రతిపాదనను పంపాలని ఆయన సూచనలు చేశారు.

హైకోర్టు నిర్వహణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ ఎంపీల ప్రశ్నతో కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో వెల్లడైంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలనే షరతుతోనే జగన్ సర్కార్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మద్దతు ఇచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపిలో త్వరలో హైకోర్టు తరలింపు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. మరోవైపు రాబోయే రోజుల్లో విశాఖకు ప‌రిపాల‌న రాజ‌ధాని రావడం ఖాయమని తాజాగా విజయసాయిరెడ్డి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలు సైతం మూడు రాజధానుల వల్ల తమకు బెనిఫిట్ కలుగుతుందని భావిస్తున్నారు. కేంద్రం సూచనలతో వైసీపీ నేతలు హైకోర్టు తరలింపు గురించి హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతారేమో చూడాలి.