టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల గోదావరి జిల్లాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన బోటు మీద నుంచి కింద పడబోయారు. పలువురు టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోగా, వారిని అక్కడే వున్న మత్స్యకారులు, భద్రతా సిబ్బంది రక్షించారు.
వరద ముంపు ప్రాంతాల్లో రాజకీయ నాయకుల పర్యటనలు అక్కడి సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగిస్తాయన్నది నిర్వివాదాంశం. అయినాగానీ, బాధితుల్ని పరామర్శించేందుకు నాయకులు వెళితే, వారి సమస్యలు మరింతగా ప్రభుత్వం దృష్టికి వెళతాయి.
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. హుద్ హుద్, తిత్లీ తుపాన్ల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేశారు.. ముఖ్యమంత్రి హోదాలో. అదే సమయంలో, అక్కడి ప్రజలకు ఆయన ధైర్యంగా నిలబడిన మాటనీ కొట్టిపారేయలేం.
ఇక, గోదావరి వరదలకు సంబంధించి కాస్త లేటుగా బాధితుల్ని పరామర్శించారు ప్రస్తుత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ రాక కోసం పార్టీ శ్రేణులు హంగామా చేయడం మామూలే. అధికార యంత్రంగం నానా హైరానా పడింది.
‘చంద్రబాబు హయాంలో పబ్లిసిటీ స్టంట్లు చేశారు.. నేను ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాను..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. అయితే, ‘అప్పుడూ, ఇప్పుడూ అవే పబ్లిసిటీ స్టంట్లు..’ అని జనం విసుక్కోవడం కనిపించింది. ‘మీరు చెప్పిందేంటి.? చేస్తున్నదేంటి.?’ అని నిలదీస్తున్న జనాన్ని అధికారులు జాగ్రత్తగా పక్కకు పంపించేశారు. ఎవరు అధికారంలో వున్నా జరిగేది ఇదే.. ముంపు బాధితుల వెతలూ అవే.!