చేష్ట‌లుడిగి చూస్తున్న ఏపీ ప్రభుత్వం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ “అనుచిత వ్యాఖ్యలు” అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తుంది. ఫలితంగా.. నోటికి అడ్డూ అదుపు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంత తేడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌ పై వైఎస్సార్‌ టీపీ అధినేత్రి ష‌ర్మిల అనుచిత వ్యాఖ్య చేశార‌నే కార‌ణంతో ఆమెను అరెస్ట్ చేసి హైద‌రాబాద్‌ కు త‌ర‌లించారు తెలంగాణ పోలీసులు. అనంతరం ఆమె పాద‌యాత్ర అనుమ‌తుల్ని ర‌ద్దు చేశారు. దీంతో… అనుచిత వ్యాఖ్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని సంకేతాలు ఇచ్చినట్లయ్యింది!

ఇక ఏపీ విషయానికొస్తే… వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు, కమ్యునిస్టులు, జనసేన నేతలు పోటీ పడిమరీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు! “నా కొడకా” అని ఒకరంటే… “అరేయ్ జగన్ – ఒరేయ్ జగన్” అని ఇంకొకరు అంటారు! “సైకో” అని ఒకరంటే.. “మూర్ఖుడు” అని మరొకరంటారు. కానీ.. ఏపీ సర్కార్ మిన్నకుంటుంది!

ఏపీ టీడీపీ నేతల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడు.. జగన్ ని ఏ స్థాయిలో మాట్లాడతారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. పవన్ కూడా తీవ్రపదాలతోనే ఏపీ సీఎం ని విమర్శిస్తుంటారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అయితే… “ఏపీలో ఓ మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు” అనేశారు.

ఇక యువగళం పాదయాత్ర లో చినబాబు లోకేష్ నోటికైతే అడ్డూ అదుపూ లేని పరిస్థితి. అసలు ఆయన చేస్తున్న యాత్ర జగన్ ని తిట్టడానికేనా అన్నట్లుగా సాగుతుంది. ఇలా ఏపీలో ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా.. శృతిమించి విమర్శలు చేస్తున్నా.. వ్యక్తిగత విషయాలపై కూడా మైకులముందు ఆడిపోసుకుంటున్నా… ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తుంది!

ఏది ఏమైనా… ప్రభుత్వాలపైనా, అధినేతలపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, చర్యలు ఈ స్థాయిలో తీసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినట్లయ్యింది. మరి.. ఏపీ ప్రభుత్వం ఇకనైనా ధైర్యం చేస్తుందా.. లేక, ఎప్పటిలాగానే చేష్ట‌లుడిగి చూస్తుందా.. అన్నది వేచి చూడాలి!!