సైనిక్స్ హ్యాపీ: పవనాలున్నాయి… పవన్ వద్దు!

ఒకపక్క గ్రేడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు, మరోపక్క ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు… వరుసగా గుడ్ రిజల్ట్ ఇస్తుండటంతో మాంచి ఖుషీగా ఉంది టీడీపీ కేడర్. 2019లో జగన్ కొట్టిన దెబ్బకి ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న పార్టీ.. తిరిగి నడుస్తుందనే నమ్మకం తముళ్లలో కలిగింది. ఫలితంగా… వారు పవన్ విషయంలో బాబుపై ఒత్తిడి తెస్తున్నారంట. ఇదే క్రమంలో కేడర్ కోరికకు సీనియర్ నాయకులు కూడా వంత పాడుతున్నారని.. ఫలితంగా బాబుపై మరింత ఒత్తిడి పెరుగుతుందని తెలుస్తుంది.

ఇంత కాలం ప్రజల నాడి తెలియ‌ని ప‌రిస్థితిలో ప‌వ‌న్‌ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంద‌ని అర్ధాంగీకారంతో తమ అంగీకారాన్ని తెలిపాము కానీ… ప్రస్తుతం పవనాలు మనకు అనుకూలంగా ఉన్నాయని.. ఇలాంటప్పుడు పవన్ తో పొత్తు అనవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంట మెజారిటీ సీనియర్లు. చంద్రబాబు నాయ‌క‌త్వానికి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తే అవ‌కాశం వుంద‌ని, అలాంట‌ప్పుడు జ‌న‌సేన‌కు అధికారంలో భాగ‌స్వామ్యం ఇవ్వడం దేనికనే వాదన తాజాగా మరింత పెరిగిపోతుందంట! గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించిన సంద‌ర్భంలో జనసేనకు – జనసేనానికీ కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా సీనియర్లు ఇష్టపడలేదని, బాబు కూడా అందుకే చెప్పలేదని సమాచారం!

దీంతో ఈ ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు కూడా పవన్ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. “సరే మీరన్నట్లు పవన్ తో పొత్తు వద్దని మనం అనుకున్నా… ఆయనే వచ్చి సైకిల్ ఎక్కుతాను, కాస్త చోటివ్వండి అంటే ఎలా” అనేది బాబు నుంచి వస్తున్న మరో ప్రశ్న అంట. “బీజేపీతో దోస్తీకి వారధిగా ఉపయోగపడతాడని భావించి తాము అంగీకరించాము కానీ… బీజేపీతోనే జనసేనకూ చెడిన తర్వాత ఆ ఆలోచన విరమించుకుంటే బెటరని” సమాధానమిస్తున్నారంట సీనియర్లు!

ఏది ఏమైనా… పవన్ లేకుండా, జనసేన తోడు అవసరం లేకుండా, పొత్తుల ప్రసక్తి ఎత్తకుండా బాబు పోటీకి రెడీ అవుతున్నారనే వార్తలు రావడం గొప్పవిషయమే అని అంటున్నారు విశ్లేషకులు. జీవితమంతా అధికరిక పొత్తులు, అనధికారిక ఒప్పందాలతోనే గెలిచిన బాబు… తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెబుతున్న తరుణంలో… ఈసారి సింగిల్ గా వెళ్లి కొట్టాలని అనుకుంటున్నారని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. అదే నిజమైతే… బాబు ఆ సాహసం చేయడానికి తాజాగా విడుదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సపోర్ట్ కచ్చితంగా ఫుల్ బూస్ట్ అనడంలో సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు!

ఇక్కడ గమనించాల్సిన మరో సంగతేంటంటే… ఈ విషయం తెలిసిన జనసైనికులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారంట. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమ నెత్తిమీద పాలుపోసాయని.. ఫలితంగా టీడీపీతో దోస్తీ చెడిపోయి, ఒంటరిగా వెళ్లి సత్తాచాటడానికి ఛాన్స్ వచ్చిందని అంటున్నారంట.