వైరల్ ఇష్యూ: అది పవన్ కోరిక మాత్రమే!

చంద్రబాబుని నమ్మి, చంద్రబాబు మాట విని పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తుంటారని వైకాపా నాయకులు చెబుతుంటారు. అయితే అవ్వొచ్చేమో… చంద్రబాబు ని నమ్మే పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఉండొచ్చు! కానీ… పవన్ ని నమ్ముకుని మాత్రం చంద్రబాబు రాజకీయాలు చేయడం లేదు.. పవన్ ని మాత్రమే నమ్ముకుని జగన్ పై పోరాడటం లేదు.. జనసైనికులను నమ్ముకుని ఎన్నికల్లో పోటీచేయడంలేదు! బాబుకి పవన్ జస్ట్ బోనస్ అంతే!

ఇప్పుడు ఈ మాటలే ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. మహానాడు సక్సెస్ అయ్యిందని, మేనిఫెస్టోపై ప్రజల్లో చర్చ జరుగుతుందని బలంగా నమ్ముతున్న టీడీపీ శ్రేణులు… ఈ మేరకు ఇలాంటి కామెంట్లను తెరపైకి తెస్తున్నారు. గతకొన్ని రోజులుగా చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, అచ్చెన్నాయుడు ఇస్తున్న స్టేట్ మెంట్ లు, టీడీపీ నెటిజన్లు పెడుతున్న పోస్టులు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అవసరం కానీ… చంద్రబాబుకు పవన్ అవసరం లేదు అని!

ఉదాహరణకు పొత్తుల ప్రస్థావన లేకుండానే రెండు రోజుల మ‌హానాడు ముగిసింది. నిజానికి పొత్తుల విషయం కేడర్ కు ఎక్కించడానికి ఇంతకుమించిన వేధిక ఉండదు. అయితే ఈ విషయంలో బాబు లైట్ తీసుకున్నారు.. కాదు కాదు… ఇంకా ఫిక్సయినట్లు లేరు! ఇక తమకు సొంతంగా 160సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు ప్రకటించారు! అంటే… ఆయన కూడా జనసేనను స్టాండ్ బై గా పక్కనుంచారు! ఇక మైకందుకున్న ఏ లీడరూ పవన్ ప్రస్థావన తేలేదు.. జనసేన టాపిక్ ఎత్తలేదు! ఎవ‌రితోనూ సంబంధం లేకుండా టీడీపీ సొంత జెండా, ఎజెండాతో అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమానే ప్రతీ టీడీపీ నేతా ప్రదర్శించారు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా… అత్యంత కీలకమైన మేనిఫెస్టో విషయంలో కూడా పవన్ ను బాబు & కో సంప్రదించలేదు! ప‌వ‌న్ అభిప్రాయాల‌తో సంబంధం లేకుండా టీడీపీ మేనిఫెస్టో త‌యారు చేసుకుంద‌ని అంటున్నారు. ఇదే విషయాలని టీవీ డిబెట్స్ లో జనసేన నాయకులు కన్ ఫాం చేస్తున్నారు. ఇది పూర్తిగా టీడీపీ తయారుచేసుకున్న మేనిఫెస్టో అని, దానితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో… పవన్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని అంటున్నారు విశ్లేషకులు.

ఇంత‌కాలం జ‌గ‌న్‌ పై విమర్శలు చేస్తూవ‌స్తున్న ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ కు తాజాగా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖ‌రి జీర్ణించుకోలేకుండా ఉందని తెలుస్తుంది. కానీ ఏమీ చేయ‌లేని నిస్సహాయ స్థితిలోకి త‌న‌ను తాను నెట్టుకున్న పరిస్థితి పవన్ ది. అయితే ఈ విషయంలో టీడీపీ నెటిజన్లు మాత్రం… “పవన్ కు చంద్రబాబు అవసరం, జనసేన మనుగడకు టీడీపీ తోడు అవసరం. అంతే తప్ప… టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన అవసరం లేదు” అని మరోసారి నొక్కి వక్కానిస్తున్నారంట. “ప్రభుత్వ ఓటు చీలనివ్వననే సాకుతో టీడీపీకి దగ్గరవ్వాలనేది పవన్ కోరికే తప్ప… ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం టీడీపీకే పడుతుందనే నమ్మకం తమకు ఉందని” అంటున్నారంట!

దీంతో… సినిమాల్లో స్టార్ గా ఉండే పవన్… రాజకీయాల్లో ఇలా ఇంత దయణీయస్థితికి వచ్చేస్తారని తాము భావించలేదని ఆవేదన చెందుతున్నారంట జనసైనికులు.