బాబ్లీ కేసు వివాదం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. టీడీపీ నాయకులు బీజేపీ, టీఆర్ఎస్ పన్నిన కుట్రగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో రెస్పాండ్ అయ్యారు. రాష్ట్రంలో నాలుగైదు రోజుల నుండి చాలా డ్రామాలు నడుస్తున్నాయన్నారు తలసాని. బాబ్లీ కేసు మీద మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని చంద్రబాబుకు అరెస్టు వారెంట్లు పంపాయంటారా? అని మండి పడ్డారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంటే చిన్న విషయానికి బాబు చిలవలు, పలవలు చేస్తున్నారన్నారు. మేము కుట్ర పన్నితే మా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎందుకు వారెంట్లు వస్తాయి అని ప్రశ్నించారు. ఇదంతా న్యాయ ప్రక్రియలో భాగం. ఈ సాకుతో చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. నా మీద కూడా కేసులు ఉన్నాయంటూ గుర్తు చేశారు తలసాని. ఇకనైనా ఈ డ్రామాను ఆపితే బాబుకి మంచిది అని హితవు పలికారు.
కాంగ్రెస్ హయాంలో నమోదైన కేసులకు మమ్మల్ని బాధ్యుల్ని చేస్తారా? బాబులాగా మేము మా ఎమ్మెల్యేలను ఫణంగా పెట్టము. టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఇప్పుడు కాదు ఆరు నెలల క్రితమే కుదిరింది. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నారు. దీని పర్యవసానాలు భవిష్యత్తులో అనుభవిస్తారు చంద్రబాబు. తెలంగాణ, ఏపీలో బాబు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో మాకు ఎలాంటి నష్టం జరగదు.
టీడీపకంటూ ఓ సిద్ధాంతం లేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం దిగజారుతున్న బాబును ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమించరు. ఈ విధంగా ఎన్టీఆర్ ఆత్మను క్షోభ పెడుతున్న బాబును ప్రజలు క్షమించరు. 29 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు బాబ్లీ కేసులో ఎందుకు తెచ్చుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఏపీ టీడీపీ నేతలు బాబ్లీ కేసు గురించి మాట్లాడటం మానుకుని కాంగ్రెస్ తో పొత్తు మీద బాబుని నిలదీయమని సూచించారు.
ఒకవేళ ఎన్నికల్లో ఇద్దరో ముగ్గురో టీడీపీ తరపున గెలిచినా వారు ఆ పార్టీలో కొనసాగుతారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో సెటిలర్లు ఎవరూ లేరు. నాలుగున్నరేళ్లుగా మాకు భద్రత లేదంటూ ఒక చిన్న కంప్లైంట్ అయినా చేసిన వారున్నారా? శాంతియుతంగా సహజీవనం చేస్తున్న వారి మధ్య టీడీపీ, కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి. తెలంగాణాలో ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులను మోహరించడం పెద్ద తప్పు అన్నారు. చంద్రబాబు డ్రామాలు మాకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణ కు ఒప్పుకుంటేనే టీడీపీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కేడర్ లేని పార్టీలు. గాల్లో దీపం పెట్టి అవి వెలగాలని కోరుకున్నట్టు ఉంది టీడీపీ కాంగ్రెస్ ల తీరు అని తలసాని విమర్శించారు.