జగన్ పై దాడి…చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం

కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఉన్న చంద్రబాబునాయుడుకు తాజా ఘటన గట్టిగానే చుట్టుకుంటోంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఉన్న జగన్ పై కత్తితో దాడి చేసి గాయ పరిచిన జరిగిన ఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకునేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పిన వ్యక్తి జగన్ దగ్గరకు వెళ్ళి హఠాత్తుగా జగన్ పై కత్తితో దాడి చేశారు.

చివరినిముషంలో ప్రమాదాన్ని గమనించిన జగన్ వెంటనే పక్కకు తప్పుకున్నారు. దాంతో కత్తి ఎడమభుజం క్రింద లోతుగా దిగింది. సరే వెంటనే విమానాశ్రయ సిబ్బంది వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారనుకోండి అది వేరే సంగతి. విమానాశ్రయం క్యాంటిన్లో పనిచేసే శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు.

సరే ఆ విషయాలను పక్కనబెడితే జడ్ క్యాటగిరిలో ఉండే జగన్ పై ఓ వ్యక్తి కత్తితో ఎలా దాడి చేయగలిగాడన్నదే అర్ధం కావటం లేదు. పాదయాత్ర మొదలైన దగ్గర నుండి కూడా జగన్ భదత్రపై వైసిపి నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షనేత, జడ్ క్యాటగిరిలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సినంత భద్రత ప్రభుత్వం ఇవ్వటం లేదని ఎప్పటి నుండో వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వంలో పెద్దగా చలనం కనిపించలేదు. పాదయాత్రలో ఉన్న జగన్ కు నిజంగానే పోలీసు భద్రత లేని విషయం చాలా సార్లే బటయపడింది. గుంటూరు, కర్నూలు లాంటి జిల్లాల్లో భద్రత కల్పించాల్సినంతగా కల్పించని విషయాలు అర్ధమైన ప్రభుత్వ పట్టించుకోలేదు.

తాజాగా విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడితో భద్రతా విషయంలో వైసిపి నేతల ఆరోపణలు, ఆందోళనలు నిజాలే అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు.  

విచిత్రమేమిటంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడికి రాష్ట్రప్రభుత్వనికి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. విమానాశ్రయంలో కేంద్ర బలగాలదే బాధ్యత అంటూ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తేల్చేయటం గమనార్హం. మొత్తానికి జగన్ పై జరిగిన దాడి చంద్రబాబు మెడకు చుట్టుకునేట్లే కనబడుతోంది.