ఈ ఐదు నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ ఎవరికి  ? పార్టీల్లో టెన్షన్

ఇపుడిదే విషయంపై పశ్చిమగోదావరి జిల్లాలో బాగా చర్చ జరుగుతోంది. ఐదు నియోజకవర్గాల్లో జనసేన గెలుస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే టిడిపి, వైసిపి అభ్యర్ధుల గెలుపోటములపై మాత్రం గట్టి ప్రభావం చూపటం ఖాయంగా తేలుతోంది.  జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోను జనసేన తరపున అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే వీరిలో ఐదుగురు అభ్యర్ధుల విషయంలో మాత్రం సస్పెన్స్ పెరిగిపోతోందట. అంటే ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన భీమవరం నియోజకవర్గం కూడా ఉందిలేండి.

భీమవరంలో పవన్ అభిమానులు బాగా ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ కాపుల ఓట్లే చాలా ఎక్కువ. అయితే సమస్య ఏమిటంటే, టిడిపి తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎంఎల్ఏ పులవర్తి రామాంజనేయులు, వైసిపి తరపున పోటి చేసిన గ్రంధి శ్రీనివాస్ కూడా కాపు సామాజికవర్గమే.  పోటీ చేసిన ముగ్గురు కూడా కాపులే అన్నమాట. అంటే కాపుల ఓట్లు ఈ నియోజకవర్గంలో ముగ్గురు మధ్య చీలిపోతాయి. కాకపోతే పవన్ కే ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మరి మిగిలిన సామాజికవర్గాలు ఎవరివైపు మొగ్గు ఎవరివైపుంటే వారిదే గెలుపు.

నరసాపురంలో టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ బండారు మాధవ నాయుడే మళ్ళీ పోటి చేశాడు. వైసిపి తరపున ముదునూరి ప్రసాదరాజు పోటీలో ఉంటే జనసేన నుండి బిసి నేత బొమ్మిడి నాయకర్ కు టికెట్ ఇచ్చింది. అయితే కాపుల ఓట్లు ప్రధాన పార్టీలు చీల్చుకుని, బిసి ఓట్లు జనసేనకు పడినా గెలుపోటములు నిర్ణయించటం కష్టమే. పాలకొల్లు నుండి టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ  నిమ్మల రామానాయుడు పోటీలో ఉండగా వైసిపి తరపున డాక్టర్ సత్యనారాయణమూర్తి (బాబ్జి)రంగంలో ఉన్నారు.  జనాల్లో బాబ్జికి మంచిపేరుంది. కాకపోతే వైసిపిలో నుండి చివరి నిముషంలో జనసేనలో చేరిన గుణ్ణం నాగుబాబు పోటీ చేశారు. అందుకే నాగుబాబు చీల్చుకునే ఓట్లే ఇక్కడ కీలకం.

ఇక తాడేపల్లిగూడెంలో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులు గట్టివారే. టిడిపి తరపున ఈలి నాని, వైసిపి నుండి కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తుండగా జనసేన అభ్యర్ధిగా బొలిశెట్టి శ్రీనీవాస్ పోటీలో ఉన్నారు. ఏలూరులో కూడా మూడు పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉందట. టిడిపి తరపున బడేటి కోటరామారావు, వైసిపి తరపున ఆళ్ళ నాని, జనసేన నుండి రెడ్డి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.  అందుకే వీలున్నంతలో అన్నీ పార్టీలు కాపులకే టికెట్లిచ్చాయి. కాబట్టి జనసేన ఎంత ఎక్కువగా ఓట్లు చీల్చుకుంటే మిగిలిన రెండు పార్టీలకు అంత నష్టం. కాకపోతే ఏ పార్టీపై ప్రభావం చూపుతుందో అర్ధం కావటం లేదు.