చంద్రబాబుకు ‘తోట’ టెన్షన్

రాబోయే ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేస్తున్న చంద్రబాబునాయుడుకు తోట త్రిమూర్తుల టెన్షన్ పెరిగిపోతోంది. అమలాపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గరు ఎంఎల్ఏలను మార్చాలని స్ధూలంగా నిర్ణయించుకున్నారని సమాచారం. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ముగ్గురికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే చంద్రబాబు అయోమయంలో పడిపోయారట.

ఇంతకీ విషయం ఏమిటంటే, రామచంద్రాపురం సిట్టింగ్ ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు వైసిపిలో చేరుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. లండన్ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తిరిగి రాగానే తోట టిడిపికి రాజీనామా చేసేస్తారనే ప్రచారం బాగా వినిపిస్తోంది. తాను టిడిపిలోనే ఉంటానని తోట చెబుతున్నా ఆ మాటను ఎవరూ నమ్మటం లేదు.

దాంతో అమలాపురం లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా రామచంద్రాపురం అసెంబ్లీ విషయమై ఏమి నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.  రామచంద్రాపురంలో టికెట్ ఇచ్చిన తర్వాత తోట పార్టీని వదిలేస్తే అంతకుమించిన అవమానం ఇంకోటుండదు. అలాగని తోటను కాదని టికెట్ ఇంకోరికి ప్రకటించే సాహసం చంద్రబాబుకు లేదు. అందుకనే  ఈ ఒక్క సీటును పెండింగ్ లో పెట్టి మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నారట.