వేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణలతో మోడికి డబుల్ ధమాకా అయితే చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి వరకూ కేంద్రంలో ఎన్డీఏకి ప్రత్యేకించి బిజెపికి పోయిన ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు రావని అందరూ అనుకున్నదే. అయితే, కేంద్రం స్ధాయిలో జరుగుతున్న హఠాత్ పరిణామాలతో మోడి సక్సెస్ గ్రాఫ్ పెరుగుతోందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. మరి మోడి గ్రాఫ్ పెరుగుతోందంటే చంద్రబాబుకు టెన్షన్ పెరగక ఏమవుతుంది ?
ఇంతకీ విషయం ఏమిటంటే, కేంద్రప్రభుత్వం రెండు రోజుల క్రితం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ అయ్యింది. దాంతో మోడి ఇమేజ్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయిందట. వచ్చే ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ తగ్గుతుందని అనుకున్న వారంతా ఇపుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. మళ్ళీ మోడి ఇమేజి పెరిగిపోయింది కాబట్టి మంచి మెజారిటీ వస్తుందనే అనుకుంటున్నారు.
ఆ విషయాన్ని పక్కనపెడితే కేంద్రం హఠాత్తుగా ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించింది. నిజానికి హోడా డిమాండ్ అయినా రైల్వేజోన్ డిమాండ్ అయినా సజీవంగా ఉందంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డే అన్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగేళ్ళుగా ఎన్డీఏతో అంటకాగిన చంద్రబాబు బయటకు వచ్చేసి పోరాటాల పేరుతో డ్రామాలాడుతున్నారు. మోడి ఏపికి అన్యాయం చేశారని చెప్పి రేపటి ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్. అలాంటిది ఎవరూ ఊహించని రీతిలో కేంద్రం రైల్వేజోన్ ప్రకటించటంతో చంద్రబాబు షాక్ కు గురయ్యారు.
రైల్వేజోన్ ప్రకటనతో బిజెపికి ఏదో లాభం వచ్చేస్తుందని అనుకునేందుకు లేదు. అయితే కేంద్రం తాజా నిర్ణయంతో రేపటి ఎన్నికల్లో బిజెపి ఓట్లు అడగటానికి అవకాశం వచ్చింది. కాకపోతే రైల్వేజోన్ అంశం మీద మోడిని విమర్శించే అవకాశం చంద్రబాబుకు తప్పిపోయింది. మోడిని చంద్రబాబు విమర్శించినా ఎదురుదాడి చేయటానికి బిజెపి నేతలకు కావాల్సినంత అవకాశం దక్కింది. కాబట్టి చంద్రబాబుకు రెండు విధాలుగానే దెబ్బపడినట్లే, ఏమంటారు ?