కడప జిల్లాలో టెన్షన్..వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు..అదుపులోకి నేతలు

వైఎస్ కోటగా చెప్పుకునే కడప జిల్లా తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకో తెలుసా ? ఈరోజు జిల్లాలో చంద్రబాబునాయుడు  పర్యటిస్తున్నారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో 25వ తేదీన జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే కదా. ఆ ఘటన తర్వాత చంద్రబాబు కడపలో పర్యటిస్తుండటమే కారణం. కడప జిల్లా అనగానే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది వైఎస్ కుటుంబమే.

అటువంటిది వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే జిల్లాలో వైసిపి శ్రేణులు, మద్దతుదారులు ఎలా స్పందిస్తారో తెలీదు. పైగా హత్యాయత్నానికి స్కెచ్ గీసిందే చంద్రబాబని స్వయంగా జగన్ ఆరోపిస్తున్న తర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయో ఊహించలేకున్నారు పోలీసులు.  చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసిపి శ్రేణులు, మద్దతుదారులు ఏ విధంగా స్పందిస్తారో తెలీక భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంతకీ జిల్లాలో అంత టెన్షన్ ఎందుకు ? ఎందుకంటే, ఈరోజు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో జరిగే ధర్మ పోరాట దీక్షలో సిఎం పాల్గొంటున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అందుకే ముందుజాగ్రత్తగా వేదిక దగ్గర వెయ్యిమంది పోలీసులను మోహరిస్తున్నారంటేనే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. 

విమానాశ్రయంలో జగన్ తప్పించుకున్న దగ్గర నుండి జిల్లాలో పోలీసులు బాగా అప్రమత్తంగా ఉన్నారట. పైగా తనపై జరిగిన హత్యాయత్నానికి చంద్రబాబే ప్రధాన కారణమని జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ నేపధ్యంలో నేతలు, మద్దతుదారులు ఎవరైనా  చంద్రబాబు పర్యటన సందర్భంగా అలజడులు సృష్టించే అవకాశాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా జిల్లాలోని పలువురు వైసిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన గంటలోపే డిజిపి ఠాకూర్ మాట్లాడుతూ, జగన్ అభిమానే దాడి చేశాడని ప్రకటించేశారు. సానుభూతి కోసమే తమపై తామే వైసిపి దాడి చేయించుకుందని డిజిపి తేల్చేశారు. తర్వాత అదే పాటను మంత్రులు వినిపించారు. అదే రోజు రాత్రి మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పై జరిగిన దాడి మొత్తం డ్రామాగా కొట్టిపడేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు జగన్, కేంద్రం కుట్రపన్నినట్లు చంద్రబాబు ఆరోపించారు. పైగా జగన్ ను బాగా ఎగతాళి చేస్తు మాట్లాడారు. దాంతో జనాలు మండిపోతున్నారు. అందుకే పోలీసులు అంత భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. మరి, టెన్షన్ మధ్య చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందో చూడాలి.