చంద్ర‌బాబులో ‘ మండ‌లి ‘ టెన్ష‌న్… త్వ‌ర‌లో ఎన్నిక‌లు

చంద్ర‌బాబునాయుడులో శాస‌న‌మండ‌లి టెన్ష‌న్ మొద‌లైన‌ట్లే. ఎందుకంటే, వ‌చ్చే మే నెల‌లో జ‌ర‌గ‌బోయే షెడ్యూల్ ఎన్నిక‌ల‌కు ముందు మూడు స్ధానాల్లో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయుల కోటాలో మార్చి 29వ తేదీకి మూడు స్ధానాలు ఖాళీ అవ‌నున్నాయి. ఇందులో రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్ధానాలు, ఒక ఉపాధ్యాయ స్ధానానికి ఎన్నిక జ‌రుగుతుంది. షెడ్యూల్ ఎన్నిక‌ల‌కు ముందు మూడు ఎంఎల్సీ స్ధానాల‌కు ఎన్నిక‌లు జరుగుతున్నాయి కాబ‌ట్టి ప్ర‌జ‌ల మూడ్ కు ఈ ఎన్నిక‌లు ఓ ట్రైల‌ర్ అనే అనుకోవ‌చ్చు.

పైగా త‌ర్వ‌లో జర‌గ‌బోయే ఎన్నిక‌లు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో జ‌రుగుతున్నాయి. ప‌ట్ట‌భ‌ద్రులకు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓట‌ర్లు పాల్గొంటారు. ఇక ఉపాధ్యాయ కోటాలో జ‌రిగే ఎన్నిక‌లో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల ఓట‌ర్లు పాల్గొంటారు. పోయిన ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ కోటా ఎన్నిక‌ల్లో తెలుగుదేశంపార్టీ ఓడిపోయింది.

స్ధానిక సంస్ధ‌ల ప్రజాప్ర‌తినిధులు ఓటు చేసే స్ధానిక సంస్ద‌ల ఎంఎల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లను మ్యానేజ్ చేసి టిడిపి గెలిచింది.
రేప‌టి ఎంఎల్సీ ఎన్నిక‌ల్లో మొత్తం 13 జిల్లాల్లోని 7 జిల్లాల ఓట‌ర్లు పాల్గొన‌బోతున్నారు . అవ‌టానికి ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్లే అయినా ఏ పార్టీ విష‌యంలో జ‌నాల మూడ్ ఎలాగుంది అనే విష‌యంలో జర‌గ‌బోయే ఎన్నిక‌ ఒక శాంపుల్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందుక‌నే అధికార తెలుగుదేశంపార్టీతో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపి, జ‌న‌సేన‌, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్నీ పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే అవ‌కాశాలున్నాయి. రాబోయే ఈ ఎన్నిక‌ల్లో మూడు స్ధానాల్లో గెలిచే పార్టీకి సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఒక బూస్ట‌ప్ గా ప‌నిచేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. వివిధ కార‌ణాల‌తో ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయుల్లో ప్ర‌భుత్వంపై విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉన్న దృష్ట్యా ఓట‌ర్లు ఎలా స్పందిస్తారో అర్ధంకాక చంద్ర‌బాబులో టెన్ష‌న్ మొద‌లైంది.