గన్ పార్కు వద్ద టెన్షన్.. టెన్షన్ (వీడియో)

గన్ పార్కు వద్ద రాహుల్ నివాళులు

తెలంగాణ అమరవీరుల స్థూపం గన్ పార్కు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రెండో రోజు సరూర్ నగర్ సభకు వెళ్లే ముందు గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే రాహుల్ అమరవీరుల స్థూపాన్ని తాకి, మొక్కి అపవిత్రం చేశారని టిఆర్ఎస్ వి నేతలు ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టిఆర్ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు అమరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. వారు అమరుల స్థూపానికి పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించగా ఎన్ఎస్ యుఐ నాయకులు అడ్డుకున్నారు. వారి మధ్య గొడవ జరిగే క్రమంలో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు.

రేపు పంద్రాగస్టు వేడుకలు ఉన్నందున అమరవీరుల స్థూపాన్ని అలంకరించారు. దీంతో టిఆర్ఎస్ వీ నేతలు శుద్ధి చేస్తామంటే అలంకరణ అంతా పాడైపోయే అవకాశముందని పోలీసులు వారించారు. కానీ  వారు గన్ పార్కు అమరుల స్థూపం వద్దకు చేరుకుని పాలాభిషేకం చేశారు. పాత అలంకరణ చెడిపోకుండా పూల మీదుగానే పాలు చల్లి శుద్ధి చేశారు.

 

 ఈ సందర్భంగా ఎంపి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ అమర వీరుల స్థూపం వద్దకు రావడంతో మలినమైపోయిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 369 మంది బలయ్యారని అన్నారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ హయాంలో కూడా తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల 1200 మంది బలయ్యారని అన్నారు. రాహుల్ అమర వీరుల స్థూపం వద్దకు వచ్చి క్షమాపణ చెప్పకుండా వెళ్లడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆందోళన తాలూకు ఫొటోలు కింద ఉన్నాయి చూడండి.

గన్ పార్క్

గన్ పార్కు వద్ద టెన్షన్

 

గన్ పార్కు వద్ద టిఆర్ఎస్ వి హల్ చల్

 

గన్ పార్కు