ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలలో 22 ఎంపీ స్థానాలలో విజయం సాధించడానికి ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ఉన్న వ్యతిరేకత ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమైందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అభివృద్ధి విషయంలో మాత్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా పథకాల అమలు జరుగుతోంది. అర్హులైన అందరికీ పథకాలు అందే విధంగా వైసీపీ సర్కార్ చర్యలు చేసుకుంటుంది. ఏ కారణం చేతనైనా అర్హులు లబ్ధి పొందని పక్షంలో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వైసీపీ కల్పిస్తుండటం గమనార్హం. అయితే వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం విషయంలో నూటికి నూరు మార్కులు పడటానికి వాలంటీర్లు కారణమని చెప్పవచ్చు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు పని చేస్తున్నారు. అయితే వాలంటీర్లకు గత మూడేళ్లలో జీతం ఏ మాత్రం పెరగలేదు. ప్రభుత్వం కేవలం 5,000 రూపాయలు మాత్రమే వేతనంగా ఇస్తుండటంతో వాలంటీర్లకు ఆ డబ్బులు చాలడం లేదు. ఎన్నికలకు 20 నెలల సమయం ఉండగా టీడీపీ వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామనే హామీతో ప్రజల్లోకి వెళ్లనుందని సమాచారం.
చంద్రబాబు వాలంటీర్లకు వేతనాన్ని పెంచుతామని చెప్పి జగన్ మాత్రం ఆ దిశగా హామీ ఇవ్వకపోతే 2024 ఎన్నికల్లో వైసీపీకి షాక్ తప్పదు. రాష్ట్రంలో రెండున్నర లక్షల వాలంటీర్లు ఉండగా వాలంటీర్ల కుటుంబాల ఓట్లు కూడా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీని డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ ఉండనుంది.