తెలంగాణ వ్యాప్తంగా 9200 పంచాయతీ కార్యదర్శుల నియమాకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త నిబంధనలు తయారు చేసి జిల్లా కమిటీల ద్వారానే నియమకాలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే నియమాకాలకు సంబంధించి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. డిఎస్సీ ద్వారా నియామకాలు చేపడితే చాలా సమస్యలు వస్తాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పటికే కాంట్రాక్టు బేస్ తో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు రిజర్వేషన్ లు కావాలని ఆందోళనకు సిద్దమవుతున్నారు. పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి కూడా ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.
ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలు ఏర్పాటు చేయడంతో చిన్న చిన్న గ్రామాలు కూడా గ్రామపంచాయతీలుగా మారాయి. పంచాయతీ కార్యదర్శులకు డిగ్రీ అర్హతతో నియామకాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలోనే పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ విధానం అమలు చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2 లుగా పోస్టుల గుర్తింపు ఉండేది. ఇప్పుడు చిన్నగ్రామాలకు ఒక గ్రేడ్, పెద్ద గ్రామాలకు ఇంకొక గ్రేడ్ గా చేసి పంచాయతీ కార్యదర్శుల నియమాకం చేపట్టాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గ్రేడ్ 1 వారికి డిగ్రీ అర్హత, గ్రేడ్ 2 వారికి ఇంటర్ అర్హత పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు అంటున్నాయి. ఎందుకంటే గ్రేడ్ 1 వారు కార్యదర్శే, గ్రేడ్ 2 వారు కూడా కార్యదర్శే.. అదే విధంగా గతంలో నియమితులైన కార్యదర్శులను డిగ్రీ అర్హతతో నియమించారు. దాంతో కొత్త , పాత కార్యదర్శుల మధ్యే వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సమాన హోదా ఇచ్చినప్పుడు విద్యార్హతలో తేడా ఎందుకని వారు వ్యతిరేకించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది.
అదే విధంగా చాలా గ్రామాలలో కారోబార్ లుగా వేలాది మంది పని చేస్తున్నారు. వారిని క్రమబద్దికరించాలని వారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సుమారు 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దికరించారు. కారోబార్ లుగా పనిచేస్తున్న వారు ప్రస్తుత నియమాకాల్లో తమకు కోటా భర్తీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా డిఎస్సీ ద్వారా నియమాకాలు జరిగితే అవకతవకలు జరిగే అవకాశం ఉందని టిఎస్ పీఎస్సీ ద్వారానే నియమకాలు జరపాలనే డిమాండ్ లు కూడా వస్తున్నాయి.
మొత్తానికి ఇన్ని అవాంతరాలు దాటితేనే పంచాయతీ కార్యదర్శుల నియమాకం సులభమవుతుంది. లేనిచో మళ్లీ అవాంతరాలు తప్పవు. అందుకే అధికారులు కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రొబేషనరీ పీరియడ్ ముగిసిన తర్వాత వారి పనితీరు బాగుంటేనే కొనసాగిస్తాం లేకుంటే లేదు అనే దానిపై కూడా నిరుద్యోగుల నుంచి విపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కేవలం రాజకీయ కోణంలోనే ఈ నియమాకాలు జరుపుతున్నారా అని విపక్షాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
కార్యదర్శు నియమాకాలకు సంబంధించి పలువురు నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు తెలుగు రాజ్యంతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..
కార్యదర్శుల నియమాకాల్లో ప్రభుత్వం అడ్డదారిలో నియమాకాలు జరపబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శుల నియమాకాలను డిగ్రీ అర్హతతో టిఎస్ పీఎస్సీ ద్వారా చేపట్టాలి. డిఎస్సీ ద్వారా అయితే రిక్రూట్ మెంట్ తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ప్రొబేషనరీ పీరియడ్ తీసి వేయాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రొబేషనరీ పీరియడ్ వరకు ఆ ఉద్యోగి పర్ ఫెక్టు కాకపోతే అంతకు తక్కువ పోస్టులలో నియమిస్తారు కానీ ఉద్యోగం నుంచి తీసివేయరు. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధన తెస్తోంది. ప్రభుత్వం ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశాక మా కార్యాచరణ ప్రకటిస్తాం.
-వీరమళ్ల శ్రీశైలం, ఏబీవీపీ సెక్రటరీ ఓయూ.