తెలంగాణలో బుధవారమే పంచాయతీ కార్యదర్శి పరీక్ష

తెలంగాణలో పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జెఎన్టీయూ అధికారులు తెలిపారు. 9355 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు బుధవారం పరీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జెఎన్టీయూ పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు.

ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్ 1 పరీక్షను, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలన్ని ఇప్పటికే సిద్దమయ్యాయని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి పరీక్షలో పెట్టిన నిబంధనతో నిరుద్యోగులు, అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలు కానీ ఇతర డిపార్ట్ మెంట్లు నిర్వహించే పరీక్షలు కానీ ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ షీటు కార్బన్ కాపీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ పంచాయతీ కార్యదర్శి పరీక్షలో మాత్రం పరీక్ష పేపర్ ను కూడా తీసుకెళ్లకుండా ఉండకపోవడం పై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. దీనిని అంతా విమర్శిస్తున్నారు. పరీక్షలో ప్రశ్నపత్రం ఇవ్వకుండా వెళ్లే అభ్యర్ధుల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జెఎన్టీయూ అధికారులు హెచ్చరించారు.

ముందు నుంచి కూడా పంచాయతీ కార్యదర్శుల పరీక్ష పై వివాదం తలెత్తింది. పరీక్ష తేదిలు మరియు అప్లికేషన్ల ప్రాసెస్ మరియు సిలబస్ ల ప్రకటన ఇవన్నీ కూడా గందరగోళంగానే ఉన్నాయి. అనేక మంది పరీక్షను వాయిదా వేయాలి సరైన సమయం లేదని కోరినా ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఇంత తొందరగా నిర్వహిస్తున్నారంటే తమకు అనుమానాలున్నాయని వెంటనే ఆపాలని నిరుద్యోగులు ఉద్యమించారు. అయినా కూడా పరీక్షను వాయిదా వేయలేదని వారు విమర్శించారు.ఓయూలో పెద్ద ఎత్తున పరీక్షను వాయిదా వేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదు.

 జెఎన్టీయూ పెట్టిన కఠిన నిబంధనలివే

పరీక్ష హాల్ లోకి బూట్లు, బంగారు నగలు వేసుకోని రావద్దు

వాచ్ లు, కాలిక్యూలేటర్లు, ఫోన్ లు తీసుకురావద్దు

సాధ్యమైనంత వరకు ఫార్మల్ డ్రెస్ లోనే రావాలి

పరీక్షకు ఎంటర్ అయిన తర్వాత పరీక్ష అయిపోయే వరకు బయటికి పంపరు

ఉదయం పేపర్ 1 పరీక్షకి 9 నుంచి 10 గంటల వరకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అనుమతిస్తారు. నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించరు. ఉదయం పది నుంచి 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయి.

బ్లూ లేదా బ్లాక్ పెన్నుతోనే పరీక్ష రాయాలి

అనవసర పేపర్లు, పర్సులు ఉండరాదు

హాల్ టికెట్ రానివారు వెబ్ సైట్ లో ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించాలి.

హాల్ టికెట్ లో పోటోలు రానివారు రెండు ఫోటోలు తెచ్చుకొని సూపరిండెంట్ తో సంతకం చేయించుకోని పరీక్షకు హాజరు కావాలి.

పరీక్ష కేంద్రానికి 8 గంటలకే చేరుకోవాలి. దూరం ఉన్న వారు ముందు రోజు వెళ్లాలి. బస్సుల కొరత ఉంటుంది కాబట్టి ముందుగా బయల్దేరేట్టు ప్లాన్ చేసుకోవాలి.

పరీక్ష అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ రెండు ఇచ్చి వెళ్లాలి. ఎవరైనా  ఇవ్వక పోతే వారి పై క్రిమినల్ కేసులు పెట్టి భవిష్యత్తులో ప్రభుత్వ పరీక్షలు రాయకుండా చేస్తామని జెఎన్టీయూ పరీక్ష నిర్వహణాధికారులు తెలిపారు.