జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఏజ్ లిమిట్ పై కిరికిరి

జూనియర్ పంచాయతీ పరీక్ష నోటిఫికేషన్ విడుదల అయ్యినప్పటి నుంచి ఏదో కిరికిరి నడుస్తూనే ఉంది. తాజాగా పరీక్ష నిర్వహించబోతున్న సమయంలో పరీక్ష ఫలితాలను తాము చెప్పేంత వరకు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ ఈ వివాదం ఎందుకు మొదలయిందంటే…

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓసీ అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ళుగా నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నోటిఫికేషన్ లో మాత్రం గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లుగా పేర్కొనడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఇది సరైనది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ఫలితాలను ప్రకటించొద్దన్ని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని పరీక్షకు అనుమతించాలని పేర్కొంది.

ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది.తదుపరి విచారణను అక్టోబర్ 9 కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్ రావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓసీ అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ 2017లో జీవో 190 జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో మాత్రం ఓసీ అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 39 సంవత్సరాలుగా పేర్కొంది. ఈ వైరుధ్యాన్ని సవాల్‌ చేస్తూ నల్లగొండకు చెందిన కె.జయధీర్‌రెడ్డి, మరో 9 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జె.కొండారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో ఓసీ అభ్యర్థుల వయోపరిమితిని 39 సంవత్సరాలుగా నిర్ణయించడం వల్ల అనేక మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. అందులో పిటిషనర్లు కూడా ఉన్నారని వివరించారు. జీవో 190 ప్రకారం పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

వాదనలు విన్న న్యాయమూర్తి.. జీవోలో 44 ఏళ్లుగా గరిష్ట వయోపరిమితిని నిర్ణయించి, నోటిఫికేషన్‌లో 39 సంవత్సరాలుగా పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయో పరిమితి ప్రాథమికంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.   దరఖాస్తులలో ఇబ్బందులే, పరీక్ష తేదిలలో ఇబ్బందులే, పరీక్ష ఫలితాలలో కూడా ఇబ్బందులే రావడంతో నిరుద్యోగులు ప్రభుత్వం పై విచారం వ్యక్తం చేశారు.