తెలంగాణ గ్రూపు 4 పరీక్ష “కీ” విడుదల

తెలంగాణలో అక్టోబర్ 7 న నిర్వహించిన గ్రూపు 4 పరీక్ష ప్రిలిమినరీ కీ ని టిఎస్ పీఎస్సీ విడుదల చేసింది. కీ ని వెబ్ సైట్ లో ఉంచారు. అభ్యర్దులకు అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20 నుంచి 26 వరకు ఆన్ లైన్ లో తెలపాలని సూచించారు. వాస్తవానికి గ్రూపు 4 పరీక్షలో చాలా పొరపాట్లు జరిగాయి. మరీ దీనిపై కమిషన్ ఏం నిర్ణయం తీసుకోనుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.

తెలంగాణలో టిఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో అక్టోబర్ 7 న నిర్వహించిన గ్రూపు 4 పరీక్ష గందరగోళానికి దారితీసింది. ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలే మళ్లీ రిపీట్ కావడంతో చాలా మంది విద్యార్దులు అవాక్యయ్యారు. ఏ కోడ్ సిరిస్ పేపర్ లో దాదాపు 30 నుంచి 40 ప్రశ్నలు వచ్చిన ప్రశ్నలే మళ్లీ వచ్చాయి.

హైదరాబాద్ లోని దమ్మాయిగూడలోని సాయి సిద్దార్ధ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఏ కోడ్ ప్రశ్నాపత్రంలో బీ కోడ్ ప్రశ్నలు కొందరు అభ్యర్ధులకు వచ్చాయి. మరి కొందరికి ఏ కోడ్ లో వచ్చిన ప్రశ్నలు, బి కోడ్ ప్రశ్నలు దాదాపు సమానంగా ఇచ్చారు. ఈ విషయాన్ని అభ్యర్దులు ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లగా టిఎస్ పీఎస్సీ చూసుకుంటుందని వారు వివరణ ఇచ్చారు. పలు సెంటర్లలో పేపర్లను ఆలస్యంగా ఇచ్చి ఎక్స్ ట్రా సమయం అడిగితే వారు ఇవ్వలేదు.

విషయం తెలుసుకున్న టిఎస్ పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ స్పందించి విషయాన్ని గుర్తించిన వెంటనే చీఫ్ సూపరిండెంట్ వేరే ప్రశ్నాపత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించారన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేవని పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు వాటి పై ప్రకటించకుండానే కీ పేపర్ ను ప్రకటించడం పై అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి పై స్పష్టమైన సమాధానం ఇచ్చాకే కీ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

గ్రూప్‌-4 సర్వీసులు, జీహెచ్‌ఎంసీలో బిల్‌ కలెక్టర్లు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పలు పోస్టులు, టీఎస్‌ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈపరీక్షకు 65శాతం మంది అభ్యర్థులు హాజర య్యారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,867 గ్రూప్‌-4 పోస్టులకు 4,80,481 మంది అభ్యర్థులకుగాను ఉదయం పేపర్‌-1కు 3,12,397 మంది, మధ్యాహ్నం పేపర్‌-2కు 3,09,482 (65 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో అభ్యర్థులు హాజరయ్యారు. నల్లగొండ జిల్లాలో 15,641 మంది దరఖాస్తు చేయగా, ఉదయం పేపర్‌-1కు 11,800 మంది, మధ్యాహ్నం పేపర్‌-2కు 11,714 (75 శాతం) మంది పరీక్ష రాశారు. అత్యల్పంగా కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 7,317 మంది దరఖాస్తు చేస్తే, ఉదయం పేపర్‌-1కు 886 మంది, మధ్యాహ్నం పేపర్‌-2కు 881 (12 శాతం) మంది హాజరయ్యారు.