ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.! టీడీపీ గెలుపు.!

మొత్తం ఏడు ఎమ్మెల్సీ సీట్లు.. అవన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లే. వైసీపీ నుంచి మొత్తం ఆరుగురు బరిలో వున్నారు. టీడీపీ నుంచి ఒకరు బరిలో వున్నారు. టీడీపీ గెలవడం దాదాపు కష్టమేనని అనుకున్నారంతా. కారణం, టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి చాలాకాలం క్రితమే దూకేశారు మరి.!

కానీ, టీడీపీ తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించింది. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల బలమే వున్నా, 23 ఓట్లతో తమ అభ్యర్థిని టీడీపీ గెలిపించుకుంది. టీడీపీ నుంచి పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే, టీడీపీకి అదనంగా నాలుగు ఓట్లు ఎలా పడ్డాయి.? అన్నది వైసీపీలో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే, వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు తిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీకి కాస్త బలం పెరిగినట్లయ్యింది. అయినాగానీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీకి ఓటెయ్యడమే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే, తమతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారంటూ ఉదయం నుంచి టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అదంతా మైండ్ గేమ్.. అని వైసీపీ కొట్టి పారేస్తూ వచ్చింది. తామే మొత్తం ఏడు సీట్లనూ గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. కానీ, ఫలితం తేడా కొట్టేసింది.

టీడీపీ వల్ల కోల్పోయిన సీటు సంగతి పక్కన పెడితే, వైసీపీ నుంచి ఆరుగురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా గెలవడానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు టీడీపీకి ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని దారాధత్తం చేయడం.. వెరసి, వైసీపీలో ఏదో జరుగుతోంది.!