వెయిటింగ్ ఫర్ వీకెండ్… టీడీపీలో ఏమి జరుగుతుంది?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు దాటింది తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో గ్రౌండ్ లెవెల్ లో అత్యంత బలమైన కేడర్ ఉన్న పార్టీ అంటే అది టీడీపీ తెలుసా? ఆ పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబుకు అంతకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉంది తెలుసా? ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారు తెలుసా?… తెలిసిన వాళ్లకు ఓకే కానీ… తాజా పరిస్థితిని గమనిస్తున్నవారికి మాత్రం పైవన్నీ నిజాలంటే నమ్మడం కాస్త కష్టమే అనడంలో సందేహం ఉండకపోవచ్చు!

ఇంతకాలం టీడీపీది మేకపోతు గాంభీర్యం.. ప్రత్యర్థులు బలహీనంగా ఉండటం వల్ల వచ్చిన బలమే తప్ప, ప్రత్యర్థులను బలహీన పరిచి సాధించుకున్న బలం కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫలితంగా… టీడీపీ ఎంత బలహీనంగా ఉందో చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరికీ అర్థమైందని అంటున్నారు పరిశీలకులు. అందుకు బాబు అరెస్ట్, తదనంతర పరిణామాలే సజీవ సాక్ష్యాలని అంటున్నారు!

సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 6 గంటలకు తన అంగీకారంతో టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉదయం లేచి టీవీలు చూసిన వారికి ఒక్కసారి గా షాకింగ్ వార్త అనే కామెంట్లు వినిపించాయి. అనంతరం విజ‌య‌వాడ‌లోని సీఐడీ ఆఫీస్‌కి రోడ్డు మార్గంలో తరలిస్తున్నారని వార్తలొచ్చాయి. దీంతో… ఆ రోడ్లన్నీ టీడీపీ నేతలు బ్లాక్ చేసేస్తారేమో అనే కంగారు అంటు జనాల్లోనూ, ఇటు పోలీసుల్లోనూ ఒక్క క్షణం కలిగిందని చెబుతుంటారు.

అయితే… వాస్తవానికి చంద్రబాబు వయసు, ఆరోగ్యం, హోదా దృష్ట్యా హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తామని అధికారులు చెప్పినా.. అందుకు ఆయన తిరస్కరించారు. దానికి రాజకీయం కారణం కూడా ఉందని వైసీపీ ఆరోపించింది. అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత నంద్యాల టు విజ‌య‌వాడ మార్గంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి అడ్డుకుంటారని చంద్రబాబు ఊహించారని చెబుతుంటారు. కానీ.. ఒకటి రెండు చోట్ల ముగ్గురు నలుగురు మించి రోడ్లపై టీడీపీ జెండాలతో కనిపించలేదు.

సంక్రాంతి సీజన్ లో హైదరబాద్ రోడ్లపై జరిగినంత సులువుగా వారి ప్రయాణం నంద్యాల టు విజయవాడ సాగిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలతో కాస్త పరిచయం ఉన్నవారంతా షాకయ్యారు. చంద్రబాబు అంతటి వ్యక్తి అరెస్టైతే ఆ పార్టీ కేడర్ నుంచి చప్పుడు లేదేంటబ్బా అనే కామెంట్లు వినిపించాయి.

చాలా మంది టీడీపీ నాయకులు సైలంట్ అయిపోయారు.. కార్యకర్తలు కిమ్మనకుండా ఉన్నారు.. ఇక ప్రజల సంగతి సరేసరి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ.. అప్పుడప్పుడూ బ్రేకింగ్ న్యూస్ లు చూస్తూ కడిపేశారు. దీంతో… అచ్చెన్నాయుడు హర్ట్ అయ్యారు.. రోడ్లపైకి జనాలను వేసుకుని రమ్మని, వారిలో కూడా మహిళలు కాస్త ఎక్కువగా ఉండేలా చూడాలని కోరారు!

అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బాబు అరెస్టును టీడీపీ శ్రేణులు కూడా సీరియస్ గా తీసుకోలేదు అనే విషయం జనాల్లోకి వెళ్లిపోయింది. అది కాస్త రోజువారీ వార్తల్లో ఒక భాగమైపోయింది. ఈ నేపథ్యంలో… బాబు అరెస్ట్ అయిన వారం రోజుల తర్వాత వీకెండ్స్‌ లో సందడి మొదలైంది.

ఇందులో భాగంగా.. హైదరాబాద్, బెంగళూరుల్లో సాప్ట్‌ వేర్ ఇంజినీర్లు కార్ల ర్యాలీతో హడావుడి చేశారు. ఇక అక్కడి నుంచి వీకెండ్ వస్తే చాలు సాప్ట్‌ వేర్ ఉద్యోగులను టార్గెట్‌ గా చేసుకుని కార్యక్రమాలకి ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేతలు. మరీ ముఖ్యంగా.. గత రెండు వారాలుగా ప్రతీ శనివారం రాత్రి నిరసనలకి పిలుపు ఇస్తున్నారు. అవి ఎందుకు అనేది పిలుపునిచ్చేవరికైనా తెలుసా అని కొందరంటే… వైకాపా నుంచి మాత్రం కౌంటర్లు బలంగా పడుతున్నాయి.

ఇందులో భాగంగా ఒక శనివారం “మోత మోగిద్దాం” అన్నారు. దీనిపై కాపు నాయకులు, ముద్రగడ సానుభూతిపరులు ఒక్క చెప్పున విరుచుకుపడ్డారు. గతంలో కాపు ఉద్యమంలో భాగంగా కంచాలపై గరిటెలతో మోగిస్తే బిక్షగాళ్లు అని అన్నారనే మాటలు గుర్తు చేశారు. కర్మ ఫలం అనుభవించండి అని ఎద్దేవా చేశారు. ఇక వచ్చిన స్పందన ఎంత అనేది తెలిసిన విషయమే.

అనంతరం రాత్రి 7 గంటలకు దీపాలు ఆర్పాలని బ్రాహ్మణి పిలుపునిచ్చారు! కాంతితో క్రాంతి అంటూ కార్యక్రమం చేపట్టారు. రిజల్ట్ సంగతి తెలిసిందే! దీంతో ఈనెల 14 (శనివారం) ప్రోగ్రాం అయినా కాస్త ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వీకెండ్ కి ప్రకటించబోయే కార్యక్రమంపై ట్రోలర్స్ కూడా అసక్తిగా ఎదురుచూస్తున్నారని అంటున్నారు.

పరిస్థితి ఇలా మారిపోవడంతో… ఇప్పుడు టీడీపీని వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మకంగా నడిపించే నాయకుడి కోసం కేడర్ ఎదురుచూస్తోందని తెలుస్తుంది. నారా లోకేష్ ప్రస్తుతం సీఐడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆనాక మళ్లీ హస్తినకు వెళ్లిపోతారని తెలుస్తుంది. మరోవైపు నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరికి రాజకీయాలపై కనీస అవగాహన కూడా లేదని అంటున్నారు.

దీంతో… ఇన్నాళ్లు పార్టీలో అన్నీ తానై నడిపించిన చంద్రబాబు.. సెకండ్ గ్రేడ్ నాయకులెవరికీ ఎదిగే అవకాశం ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు పార్టీలో నాయకత్వం కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్నింటికీ మించి వీకెండ్ నిరసన కార్యక్రమాలను మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. దీంతో… అవన్నీ కేవలం ఒక సామాజిక‌వ‌ర్గం నిర‌స‌న కార్యక్రమాలుగా మిగిలిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు.