ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు మూడు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకటి అధికార పార్టీ చేసే విమర్శలకు ఎదుర్కోవడం.. జనసేనతో సీట్ల సర్దుబాటుతో రెబల్స్ పుట్టకుండా చూసుకోవడం.. వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నవారితో తమ్ముళ్లు అలిగి మొదటికే మోసం తేకుండా జాగ్రత్త పడటం. ఇలా గెలుపు అనివార్యమైన ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయి.
ఇక్కడ వైసీపీతో రాజకీయంగా ఫైట్ చేయడం ఒకెత్తు అయితే… ప్రధానంగా మిగిలిన రెండు సమస్యలూ మరొకెత్తు అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా.. ఇప్పటికే తాము సిద్ధపడిన చోట ఆ స్థానాలను జనసేనకు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు రచ్చ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ ప్రకటించిన రాజోలు, రాజానగరం కాక టీడీపీకి గట్టిగా తగలబోతుందని తెలుస్తుంది. నిన్న రాజమండ్రిలో జరిగిన “రా.. కదలిరా” సభలో రాజానగరం ఎఫెక్ట్ తగిలిందని చెబుతున్నారు.
రాజానగరం టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి అనుచరులు హల్ చల్ చేశారని తెలుస్తుంది. ఈ టిక్కెట్ జనసేనకే కేటాయిస్తే… ఇండిపెండెంట్ గా అయినా పోటీకి నిలబెట్టుకుంటామని చెబుతున్నారని సమాచారం. ఇక రాజోలులో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుచరులు పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడిని కలిశారు. ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి చూశారు.
ఈ సమయంలో వారిని సర్దిచెప్పి పంపించేశారు అచ్చెన్నా. అయితే.. వారంతా రాజోలులో మీటింగ్ పెట్టుకుని.. ఆరు నూరైనా నూరు ఆరైనా.. రాజోలు నుంచి గొల్లపల్లి పోటీ చేస్తారని చెబుతున్నారు. అది టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగానా.. లేక, ఇండిపెండెంట్ గానా అనేది వేచి చూడాలనే సంకేతాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా జనసేన ప్రకటించుకున్న రెండు స్థానాల్లోనూ రచ్చ పీక్స్ కి చేరుతుంది.
ఈ సమయంలో నూజివీడు నియోజకవర్గం వ్యవహారం తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతున్న కొలుసు పార్థసారధికి నూజివీడు టిక్కెట్ చంద్రబాబు కన్ ఫాం చేశారని కథనాలొస్తున్నాయి. దీంతో… నూజివీడు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు! తాజాగా నూజివీడులోని బస్టాండు, రైల్వేస్టేషన్ తో సహా చిన్న చిన్న హోటళ్ల దగ్గర నుంచి ప్రతీ చోటా కొన్ని పోస్టర్లు కనిపిస్తున్నాయి.
వాటిలో… “ఇక్కడ నేనే అభ్యర్థిని. చంద్రబాబు నాకు ఎప్పుడో మాటిచ్చారు. ‘నువ్వే పోటీ చేస్తున్నావ్’. అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నాపై కుట్ర రాజకీయాలకు తెరదీసింది. అందుకే.. అభ్యర్థిని మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనిని ఎవరూ నమ్మొద్దు” అని ఉన్న ఆ పోస్టర్లు ఇప్పుడు నూజివీడులో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నూజివీడు టిక్కెట్ పార్ధసారధికి అని కథనాలొచ్చిన వేళ.. రాత్రికి రాత్రి ఇవి వెలిశాయి.
పైగా పార్థసారథి టీడీపీ అభ్యర్థి అని వార్తలు తెరపైకి వచ్చిన అనంతరం స్పందించిన వెంకటేశ్వర్ రావు… “నూజివీడులో గెలిచి.. చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. ఆయన అలా చెప్పిన రెండు మూడు గంటల్లోనే నూజివీడు అంతా ఇలా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సమస్యలు ముందు ముందు ఇంకెన్ని వస్తాయో.. చంద్రబాబు వీటన్నింటినీ ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలని తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.