పులివెందులలో టిడిపి క్యాండిడేట్ ఫైనల్

కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారు. గడచిన నాలుగు పర్యాయాలుగా ఈ నియోజకవర్గంలో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోతున్న సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డినే ఐదోసారి కూడా పోటీ చేయమని చంద్రబాబు ఆదేశించారు. నిజానికి కడప జిల్లా అంటే వైఎస్ జిల్లా అనే పాపులర్ అయ్యింది. అందులోను పులివెందుల అంటే చెప్పాల్సిన పనేలేదు. కాకపోతే ఎన్నికలన్నాక ప్రత్యర్ధులు, పోటీ తప్పదు కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ పెడుతోంది అంతే. టిడిపి పోటీ చేసినంత మాత్రాన ఏదో అద్భుతాలు జరిగిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు.

 

ఇక సతీష్ రెడ్డి సంగతి చూస్తే రేపటి ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఐదోసారి. నిజానికి జగన్ మీద పోటీ చేయటానికి టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి కూడా బాగా ఉత్సాహం చూపారు. కానీ ఎందుచేతనో చంద్రబాబు మాత్రం సతీష్ వైపు మొగ్గుచూపారు. సతీష్ మొదటిసారి పోటీ చేసింది 1999లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీదే. అంతకుముందు వైఎస్ తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో సతీష్ కూడా నిందితుడే. కాకపోతే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సతీష్ పైనున్న కేసులను కొట్టేశారు. దాంతో కేసులో నుండి బయటపడిన తర్వాత రాజకీయంగా షెల్టర్ కోసం టిడిపిలో చేరారు. అప్పటి నుండి నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా టిడిపిలో కీలకంగా ఎదిగారు.

 

సతీష్ రెడ్డి ఇఫ్పటి వరకూ మూడుసార్లు వైఎస్ పైన పోటీ చేస్తే పోయిన ఎన్నికల్లో జగన్ మీద కూడా పోటీ చేశారు. ఎప్పుడు పోటీ చిసినా ఓటమే అయినా సతీష్ తప్ప వేరే దిక్కులేదన్నట్లుగా తయారైంది టిడిపి పరిస్దితి. పోయిన ఎన్నకల్లో జగన్ కు 124576 ఓట్లు వస్తే సతీష్ కు 49333 ఓట్లు వచ్చాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో చంద్రబాబు కడప జిల్లాలోని ముఖ్య నేతలతో ఈమధ్యనే సమావేశమయ్యారు. ఆ సమయంలో పులివెందులలో పోటీ చేసే విషయమై చర్చ జరిగినపుడు సతీష్ పేరు ఖాయమైంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటలాంటి పులివెందులలో ఇప్పటి వరకూ ప్రత్యర్ధులు గెలిచిందే లేదు. కాకపోతే కడప జిల్లాకు సాగు, తాగు నీళ్ళిచ్చామని కాబట్టి తమనే గెలిపిస్తారని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ సారైన టిడిపి గట్టిపోటి ఇస్తుందేమో చూడాలి.