చంద్రగిరి రాజకీయంలో ఎల్వీనే టార్గెట్

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ వ్యవహారంలో టిడిపి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్నే టార్గెట్ గా చేసుకుంది. అసలే చంద్రబాబునాయుడుకు ఎల్వీకి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే రీ పోలింగ్ విషయంలో తనముందుకు వచ్చిన ఫిర్యాదును ఎల్వీ ఎన్నికల సంఘానికి పంపటంతో ఇపుడు టిడిపి నేతలు మండిపోతున్నారు. చంద్రబాబు సొంతూరు చంద్రగిరిలో కావాలనే ఎల్వీ రీ పోలింగ్ కు సిఫారసు చేసినట్లుగా ఆరోపిస్తున్నారు.

నిజానికి పోలింగ్ జరిగిన రోజున నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో టిడిపి నేతలు బాగా ఓవర్ యాక్షన్ చేసిన మాట వాస్తవమే. ఐదు పోలింగ్ కేంద్రాల్లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో వాళ్ళల్లో చాలామందిని టిడిపి నేతలు ఓటింగ్ కే రానీయలేదనే ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు పలువురు వైసిపి నేతలపై దాడులు కూడా జరిగాయి.

దళితులను ఓట్లేసేందుకు రానీయకుండా అడ్డుకోవటంతో చెవిరెడ్డి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే అదే సమయంలో 20 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని టిడిపి నేతలు కూడా ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి చేసిన ఫిర్యాదులో వీడియో సాక్ష్యాలు కూడా ఉండటంతో  ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ కు ఆదేశించింది. పోలింగ్ జరిగిన 34 రోజుల తర్వాత రీ పోలింగ్ ఆదేశాలపై అన్ని వైపుల నుండి విమర్శలున్నాయి లేండి.

చెవిరెడ్డి ఫిర్యాదునే ఎన్నికల కమీషన్ పట్టించుకోవటంతో టిడిపి వెంటనే ఎల్వీని టార్గెట్ చేస్తోంది. కావాలనే చీఫ్ సెక్రటరీ వైసిపి ఫిర్యాదును సిఫారసు చేసినట్లు మండిపోతున్నారు. దానికి ఎల్వీ మాట్లాడుతూ తనకొచ్చిన ఫిర్యాదును ఎన్నికల కమీషన్ కు సిఫారసు చేశానంటున్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయంతో తనకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినా టిడిపి మాత్రం ఎల్వీనే టార్గెట్ చేస్తోంది.