కడప గడపలో టీడీపీ సర్వే… రిజల్ట్ ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరి లక్ష్యాలు వారికున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని, భీమవరంలో పవన్ ని, టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఓడించాలని అధికార పార్టీ పథకాలు రచిస్తుంది! ఇదే సమయంలో… కడపలో ఎంతో కొంత సత్తా చాటాలని, రాయల్సీమలో వార్ వన్ సైడ్ కాకుండా చూడాలని టీడీపీ – జనసేన కూటమి లెక్కలేస్తుంది. ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ సర్వే చేపట్టింది. దీంతో సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది.

అవును… కడప జిల్లాపై టీడీపీ – జనసేన దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో, ప్రధానంగా కడపలో వార్ వన్ సైడ్ కాకూడదని.. ఎంతో కొంత సత్తా చాటాలని బలంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. కడప జిల్లాలో సర్వే చేపట్టారు. దీంతో గందరగోళ పరిస్థితులు తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఈ సర్వేల ఫలితంగా జనసేన, టీడీపీ అభ్యర్థుల మధ్య సరికొత్త రచ్చ మొదలవుతుందని అంటున్నారు. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే… కడప జిల్లాలో చంద్రబాబునాయుడు సర్వేలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా… వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అభ్యర్ధిగా ఎవరుంటే బాగుంటుందనే విషయమై అభిప్రాయ సేకరణ చేయిస్తున్నారు. ఈ అభిప్రాయం కూడా మొబైల్ ఫోన్ల ఐ.వీ.ఆర్.ఎస్ విధానంలో చేయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక నిర్ణయం తీసుకునే ముందు ఈ పనికి పూనుకున్నారట చంద్రబాబు.

ఇక ఈ సర్వే ఫలితాల సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ ఐ.వీ.ఆర్.ఎస్. పుణ్యమాని పార్టీల్లో గందరగోళం పెరిగిపోతోంది. వాస్తవానికి ప్రొద్దుటూరులో టికెట్ కోసం నలుగురు నేతలు బలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా… వరదరాజుల రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మల్లెల లింగారెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో ఒకరు చంద్రబాబుతో మంతనాలు జరుపుతుంటే.. మరొకరు చినబాబును బుజ్జగించే పనిలో ఉన్నారని అంటున్నారు.

వాస్తవానికి యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ యువకిశోరం నారా లోకేష్ ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా పలు విమర్శలు వచ్చాయని అంటున్నారు. మరోపక్క తాజా సర్వే వరదరాజుల రెడ్డి అభ్యర్ధి అయితే ఎలాగుంటుందనే విషయం మీద జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మిగిలిన అభ్యర్థుల్లో టెన్షన్ తో పాటు కేడర్ లో కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది.

ఇక కమలాపురం నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ ఇన్ ఛార్జ్ గా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. దీంతో… ఈ సారి టికెట్ పుత్తాకే అని అంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు కూడా పుత్తాకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే… తాజా సర్వే మాత్రం వీరశివారెడ్డి పేరు మీద జరిగింది! దీంతో… పుత్తా వర్గంతో పాటు ఇతర నేతల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటికే పుత్త ఇన్ ఛార్జ్ గా ఉండగా ఈ సమయంలో ఈ కొత్త ట్విస్ట్ లు ఏమిటని మండిపడుతున్నారంట.

ఇదే సమయంలో రాజంపేట నియోజకవర్గం విషయానికొస్తే… ఈ టిక్కెట్ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని గతంలో మాటలు వినిపించాయి. ఈ విషయంలో రాజంపేట సీటును తమకు కావాలని పవన్ కల్యాణ్ అడిగితే చంద్రబాబు ఓకే చెప్పారట. ఈ విషయాన్ని జనసేన అభ్యర్థి శ్రీనివాస రాజుకు చెప్పిన పవన్… గట్టిగా పనిచేసుకోమని చెప్పారట. దీంతో శ్రీనివాస్ రాజు ఆ పనిలో ఉన్నారని అంటున్నారు.

కట్ చేస్తే… తాజాగా రాజంపేట నియోజకవర్గంలో బత్యాల చెంగల్రాయలు, గంటా నరహరి అభ్యర్ధిత్వాలపై సర్వే జరిగిందని తెలుస్తుంది. ఇలా టీడీపీ నేతల పేర్లపై సర్వే జరగటంతో అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీల్లోను గందరగోళం మొదలైందని తెలుస్తుంది. దీంతో ఈ సర్వే వల్ల జిల్లాలో కొత్త సమస్యలు తలెత్తేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

మరి… అసలు చంద్రబాబు ఈ సర్వేలను ఏ ఉద్దేశ్యంతో చేయించారో.. అంతకు ముందు అభ్యర్థులకు మాటెందుకు ఇచ్చారో.. జనసేనకు కేటాయించారని చెబుతున్న సీట్లో కూడా టీడీపీ నేతల పేర్లతో ఎందుకు సర్వేలు చేయిస్తున్నారో బాబు & కో కే తెలియాలంటూ తలలు పట్టుకుంటున్నారంట టీడీపీ – జనసేన కార్యకర్తలు!